1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : సౌతాఫ్రికా వెన్ను విరిచిన రవీంద్ర జడేజా...

ravindra jadeja
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. ముఖ్యంగా, ప్రత్యర్థి జట్టును చిత్తుగా ఓడించడంలో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా కీలక పాత్రను పోషించాడు. ఫలితంగా 83 పరుగులకే సౌతాఫ్రికా జట్టు ఆలౌట్ అయింది. ఇందులో ఐదు వికెట్లను రవీంద్ర జడేజా తీశాడు. 33 పరుగులు ఇచ్చాడు. 
 
అలాగే, ఈ వరల్డ్‌ కప్‌లో 110 పరుగులు, 14 వికెట్లు తీశాడు. టీమ్‌ఇండియా విజేతగా నిలిచిన 2011 వరల్డ్‌ కప్‌లో యువరాజ్‌ సింగ్‌ నిర్వర్తించిన బాధ్యతలను ఈసారి జడ్డూ చేయడం విశేషం. మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జడేజా మాట్లాడాడు. ఆల్‌రౌండర్‌గా తన పాత్ర ఏంటనే దానిపై పూర్తి స్పష్టతతో ఉన్నట్లు తెలిపాడు.
 
'తొలి రోజు నుంచీ నేను కెప్టెన్‌గానే ఆలోచిస్తా. ఆల్‌రౌండర్‌గా నా పాత్ర ఏంటో తెలుసు. జట్టుకు అవసరమైనప్పుడు 30-35 పరుగులు చేయడం.. కీలక సమయంలో వికెట్ తీసి బ్రేక్‌ ఇవ్వడం నా బాధ్యత. మ్యాచ్‌పై నా ప్రదర్శనతో ప్రభావం చూపించడానికే ప్రయత్నిస్తా. ఇక ఫీల్డింగ్‌లో నేనే గొప్ప అని భావించను. క్యాచ్‌ను కూడా మిస్‌ చేశా. అయితే, ఎప్పటికప్పుడు సన్నద్ధమవుతూనే ఉంటా. ఒక క్యాచ్‌ పట్టగానే.. మైదానంలో రిలాక్స్‌ అయిపోను. మెరుగ్గా ఫీల్డింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. కొన్నిసార్లు అందుకోలేకపోవచ్చు. కానీ ప్రయత్నించడం మాత్రం ఆపను.
 
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఫాస్ట్‌ బౌలర్లు త్వరగా వికెట్లు తీయడంతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెరిగింది. నేను లైన్ అండ్‌ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్‌ చేశా. కీలక మ్యాచుల్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించడం ఆనందంగా ఉంది. నా ఆటపట్ల నాకెప్పుడూ నమ్మకం ఉంటుంది. పేసర్లు ఆరంభంలోనే వికెట్లను అందించడం వల్ల స్పిన్నర్లకు మరింత సులువవుతుంది. నాకౌట్‌ దశలోనూ ఇదే ఆటతీరును ప్రదర్శిస్తామని భావిస్తున్నా' అని రవీంద్ర జడేజా వెల్లడించాడు.