ఐపీఎల్ వ్యవస్థాపకుడుకి షాకిచ్చిన వనాటు దేశం... ఎలా?
క్రికెట్ ప్రపంచంలో అత్యంత సంపన్న క్రికెట్ పోటీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోడీకి వనాటు దేశం తేరుకోలేని షాకిచ్చింది. లలిత్ మోడీకి ఇచ్చిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనాటు దేశ ప్రధాని జోథం నపాట్ ఆదేశించారు. ఈ మేరకు పనాటు దేశ పౌరసత్వ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేశారు.
దరఖాస్తు సమయంలో నిర్వహించిన ఇంటర్ పోల్ స్క్రీనింగ్‌లతో సహా అన్ని ప్రామాణిక నేపథ్య తనిఖీలలో లలిత్ మోడీపై ఎలాంటి నేరారోపణలు లేవని తేలింది. అయితే గత 24 గంటల్లో ఆయనపై హెచ్చరికల నోటీసు జారీ చేయాలని భారత అధికారులు ఇంటర్‌పోల్‌కు రెండుసార్లు అభ్యర్థనులు చేయడం జరిగింది.
అయితే, తగిన ఆధారాలు లేనందువల్ల వారి అభ్యర్థనలను ఇంటర్ పోల్ తిరస్కరించింది. పనాటు పౌరసత్వం పొందడానికి చట్టబద్ధమైన కారణాలు ఉండాలి. స్వదేశంలో దర్యాప్తునకు తప్పించుకోవడానికి అతడు వనాటు పౌరసత్వం తీసుకున్నట్టు తెలుస్తోంది. లలిత్ మోడీ చూపిన కారణం చట్టబద్ధంగా లేకపోవడంతో ఆయనకు జారీచేసిన పౌరసత్వం రద్దు చేయాలని నిర్ణయించుకున్నాం అని ప్రధాని జోథం నపాట్ వెల్లడించారు.