టీ20 క్రికెట్ నుంచి కూడా కోహ్లి రిటైర్ అవుతాడు.. అహ్మద్ కామెంట్
టీ20ల్లో టీమిండియా కెప్టెన్సీకు విరాట్ కోహ్లి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. భారత తదుపరి టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ ముస్తాక్ అహ్మద్ సంచలన వాఖ్యలు చేశాడు. టీమిండియాలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ, అందుకే కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని అతడు ఆరోపించాడు. త్వరలో అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి కూడా కోహ్లి రిటైర్ అవుతాడని అహ్మద్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
"ఒక విజయవంతమైన కెప్టెన్ తాను కెప్టెన్సీనుంచి తప్పుకున్నాడంటే.. డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం ఏమీ బాగాలేదని అర్థం. నేను ప్రస్తుతం టీమిండియాలో రెండు గ్రూపులను చూస్తున్నాను. ఒకటి ఢిల్లీ గ్రూప్, రెండోది ముంబై. కోహ్లి త్వరలో అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అవుతాడని, కేవలం ఐపీఎల్‌లోనే కొనసాగుతాడని నేను భావిస్తున్నాను.
టీ20 ప్రపంచకప్‌లో ఐపీఎల్ కారణంగానే భారత్ ఓడిపోయింది. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీకి ముందు సుదీర్ఘకాలం బయోబబుల్‌లో ఉండటం టీమిండియా ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీసింది" అని అతడు జియో న్యూస్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.