మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (12:27 IST)

రాంచీ మైదానంలో మెరిసిన ధోనీ.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు (video)

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టుకు దూరంగా వున్నాడని త్వరలో క్రికెట్‌కు గుడ్ బై చెప్తాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. మంగళవారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ మైదానంలో కనిపించాడు. ప్రస్తుతం ధోనీ టీమిండియా-దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్ సందర్భంగా మైదానంలో టీషర్టు స్మార్ట్‌గా కనిపించడంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఇంకా ధోనీకి సంబంధించిన ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. 
 
కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో భారత్ ఇన్నింగ్స్‌ 202 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ నేపథ్యంలో టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. రాంచీ వేదికగా మూడో టెస్ట్ జరిగింది. ఎంఎస్‌ ధోనీ స్వస్థలం రాంచీ కాబట్టి.. తొలి రోజే మ్యాచ్‌కు హాజరవుతాడని అందరూ ఊహించారు. కానీ.. మంగళవారం మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ మైదానంకు వచ్చాడు.
 
ధోనీ రాగానే మైదానం మొత్తం అరుపులతో దద్దరిల్లింది. ఫాన్స్ ధోనీ.. ధోనీ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. బహుమతి ప్రదానోత్సవం పూర్తయ్యాక ధోనీ టీమిండియా డ్రస్సింగ్‌ రూమ్‌కు చేరుకున్నాడు. అక్కడ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, జట్టు సభ్యులతో చాలా సమయం గడిపాడు. రవిశాస్త్రితో కలిసి ధోనీ ఫొటోలకు ఫోజులిచ్చాడు. అనంతరం భారత్‌ తరఫున అరంగేట్రం చేసిన జార్ఖండ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌తో ధోనీ ప్రత్యేకంగా ముచ్చటించాడు. దీనికి సంబందించిన ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
 
ధోనీ తనతో ప్రస్తావించిన విషయాలను గురించి షాబాజ్ మీడియాకు తెలియజేశాడు. మ్యాచ్ తర్వాత ధోనీని కలిసిన తాను.. ఎలా ఆడానని అడిగానన్నాడు. బౌలింగ్‌లో ఎంతో పరిణితి సాధించావని ధోనీ చెప్పినట్లు షాబాజ్ వ్యాఖ్యానించాడు. దేశవాళీ క్రికెట్‌లో ఆడిన అనుభవం ఇక్కడ పని చేసింది. బౌలింగ్‌లో ఎక్కువ ప్రయోగాలు చేయకు. ఇప్పుడు ఎలా ఆడుతున్నావో అలాగే ఆడు.. అంటూ సలహాలిచ్చినట్లు షాబాజ్ వెల్లడించాడు.