గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

అరంగేట్రంలోనే అదరగొట్టిన యువ పేసర్... లక్నో సూపర్ జెయింట్ విజయంలో కీలకపాత్ర!!

mayank yadav
ఐపీఎల్ సీజన్ 2024లో భాగంగా, శనివారం రాత్రి పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ద్వారా లక్నో జట్టు తరపున మయాంక్ యాదవ్ అరంగేట్రం చేశారు. ఈ యువ పేసర్ తన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. నాలుగు ఓవర్లు వేసిన మయాంక్.. కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీసి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నారు. పైగా, తన తొలి మ్యాచ్‌లోనే గంటకు 156 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. నయా సంచలనంగా మారిన మయాంక్ యాదవ్ శనివారం రాత్రి పంజాబ్ కింగ్స్‌పై మ్యాచ్ గంటకు 156 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతి ఐపీఎల్ 2024లో అత్యంత వేగవంతమైన బంతిగా నమోదైంది. ఈ సీజన్‌లో నండ్రే బర్గర్ పేరిట ఉన్న రికార్డును యువ సంచలనం అధిగమించాడు. జానీ బెయిర్ రూపంలో ఐపీఎల్లో తన తొలి వికెట్‌ను అందుకున్నాడు. ప్రభమ్రాన్ సింగ్, జితేశ్ శర్మలను కూడా ఔట్ చేసి లక్నో సూపర్ జెయింట్స్‌ను విజయ తీరాలకు చేర్చాడు.
 
ఢిల్లీకి చెందిన పేసర్ మయాంక్ యాదవ్ వయసు కేవలం 21 సంవత్సరాలే. 2022 ఐపీఎల్ మెగా వేలంలో బేస్ ధర రూ.20 లక్షల మొత్తంతో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. అంతకుముందు రెండు సీజన్‌లో అవకాశం ఇవ్వకపోయినప్పటికీ అతడిని జట్టులోనే కొనసాగించింది. అయితే గాయం కారణంగా ఐపీఎల్ 2023 మధ్యలోనే వైదొలిగాడు. అతడు ఇప్పటివరకు ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్, 17 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 10 టీ20 మ్యాచ్‌‍లు ఆడాడు. నార్త్ జోన్ తరపున 'దేవధర్ ట్రోఫీ'లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ అరంగేట్రానికి ముందు లిస్ట్-ఏ క్రికెట్లో 34 వికెట్లు తీశాడు. ఇక టీ20లలో 12, ఫస్ట్-క్లాస్ క్రికెట్లో 2 వికెట్లు పడగొట్టాడు. మార్క్ ఉడ్ అందుబాటులో లేకపోవడంతో మయాంక్ యాదవ్ గత రాత్రి చోటు దక్కింది.
 
కాగా, ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ జట్టుకు మరో ఓటమి ఎదురైంది. అలాగే, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ శిఖర్ ధావన్ 70 పరుగులతో రాణించినప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయం తప్పలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించడంతో ఈ మ్యాచ్ లక్నో 21 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. 
 
ఓపెనర్లు శిఖర్ ధావన్ (70), జానీ బెయిర్ స్టో (42) రాణించారు. తొలి వికెట్కు 102 పరుగుల భాగస్వామ్యం అందించినప్పటికీ ఆ తర్వాత వచ్చినవారు అంతగా రాణించలేకపోయారు. ప్రభ్సిమ్రాన్ సింగ్ (19), జితేశ్ శర్మ(6), లివింగ్ స్టోన్ (28 నాటౌట్), సామ్ కరాన్(0), శశాంక్ సింగ్ (9 నాటౌట్) చొప్పున మాత్రమే పరుగులు చేశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (54), నికోలస్ పూరన్ (42) రాణించారు. ఇక పంజాబ్ బౌలర్లలో సామ్ కర్రాన్ 3 వికెట్లు, అర్షదీప్ సింగ్ 2 కీలకమైన వికెట్లు తీశారు.