వైజాగ్ వన్డేలో సఫారీలను చిత్తు చేసిన టీమిండియా - సిరీస్ కైవసం
వైజాగ్ వేదికగా జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సఫారీలను భారత ఆటగాళ్లు చిత్తుగా ఓడించారు. ఫలితంగా సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకున్నారు. భారత ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ అజేయ సెంచరీతో రాణించగా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలు తలా నాలుగు వికెట్లను నేలకూల్చి సఫారీల వెన్ను విరిచారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. సఫారీ ఆటగాళ్లలో డికాక్ 106 పరుగులు చేసి రాణించగా, కెప్టెన్ బవుమా 48 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో కుల్దీప్, కృష్ణలు తలా 4 వికెట్లు చొప్పున తీయగా, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజాలు చెరో వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత 271 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 39.5 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. భారత ఆటగాళ్లలో జైస్వాల్, రోహిత్ శర్మలు ఓపెనర్లుగా బరిలోకి దిగి మంచి శుభారంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ దూకుడుగా ఆడి 75 రన్స్ చేయగా, జైస్వాల్ 116 (నాటౌట్) పరుగులు చేశాడు. జైస్వాల్‌ను కెరీర్‌లోనే తొలి సెంచరీ కావడం గమనార్హం. విరాట్ కోహ్లీ 45 బంతుల్లో 65 పరుగులు చేశాడు. దీంతో భారత్ సునాయాసంగా మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.