సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 16 జూన్ 2017 (06:44 IST)

జాదవ్‌కు బంతి ఇమ్మన్నాడు.. బంగ్లా జట్టు నడ్డి విరిచాడు.. దటీజ్ ధోనీ.. కోహ్లీ సంబరం

సమకాలీన క్రికెట్‌లో ఆ ఇద్దరి మధ్య ఉన్న సమన్వయం, అవగాహన మరే ఆటగాళ్ల మధ్య లేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. నిన్న టి కెప్టెన్, నేటి కెప్టెన్ ఇద్దరూ అహాలు వదిలి తమ అనుభవాన్ని షేర్ చేసుకుంటే ఎంత అద్బుతాలు జరుగుతాయో ఐసీసీ చాంపియన్ ట్రోపీలో అడుగడుగునా కనబడు

సమకాలీన క్రికెట్‌లో ఆ  ఇద్దరి మధ్య ఉన్న సమన్వయం, అవగాహన మరే ఆటగాళ్ల మధ్య లేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. నిన్న టి కెప్టెన్, నేటి కెప్టెన్ ఇద్దరూ అహాలు వదిలి తమ అనుభవాన్ని షేర్ చేసుకుంటే ఎంత అద్బుతాలు జరుగుతాయో ఐసీసీ చాంపియన్ ట్రోపీలో అడుగడుగునా కనబడుతూనే ఉంది. ఆ అద్భుతాలకు కేంద్ర బిందువులు ధోనీ, కోహ్లీ.
 
ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీఫైనల్లో మ్యాచ్‌ను మలుపు తిప్పే నిర్ణయంలో ధోని తనవంతు పాత్ర పోషించాడు! బంగ్లా పటిష్ట స్థితిలో ఉండగా పార్ట్‌టైం బౌలర్‌ కేదార్‌ జాదవ్‌ను బౌలింగ్‌కు దించాలన్న నిర్ణయం కోహ్లి, ధోని కలిసి తీసుకున్నదట. ఈ సంగతి కోహ్లీనే వెల్లడిస్తే గానీ ఎవరికీ తెలియక పోవడం విశేషం. 
 
బంగ్లా జట్టు భారీ స్కోరు వైపుగా పయనం సాగిస్తున్న దిశలో పార్ట్‌టైం బౌలర్‌ కేదార్‌ జాదవ్‌ను బౌలింగ్‌కు దించాలన్న నిర్ణయం నా ఒక్కడిదే కాదు. ధోని, నేను ఇద్దరం కలిసే ఆ నిర్ణయం తీసుకున్నాం. కేదార్‌ను ఆ సమయంలో బౌలింగ్‌కు దించితే బాగుంటుందని భావించాం’’ అని కోహ్లి అన్నాడు. బౌలింగ్‌లో కేదార్‌ జాదవ్‌ ఆశ్చర్యకర అస్త్రమేమీ కాదు. అతను తెలివైన ఆటగాడు. పిచ్‌ను బట్టి బంతి ఎక్కడ వేయాలో జాదవ్‌కు తెలుసు అని కితాబిచ్చాడు కోహ్లీ. 
 
నిజంగానే జాదవ్ నిలకడగా ఆడుతున్న బంగ్లా జట్టు నడ్డి విరిచాడు. పార్ట్ టైమ్ బౌలర్‌గా జాదవ్ వేసిన ఆరు ఓవర్లు బంగ్లా దేశ్ రన్ రేట్‌ను దారుణంగా దెబ్బతీశాయి. ఆరు ఓవర్లలో 22 పరుగులిచ్చి రెండు కీలకమైన వికెట్లు తీసిన జాదవ్ దెబ్బకు అంతవరకు 5.68గా ఉన్న బంగ్లా జట్టు రన్ రేట్ ఒక్కసారిగా 3.73కి పడిపోయింది. 
 
హార్దిక్ పాండ్యా 3 ఓవర్లకే 28 పరుగులు సమర్పించుకోవడంతో టీమిండియా మరో తురుపు ముక్కను ఎంచుకుంది. ఆ తురుపుముక్కే కేదార్ జాదవ్. ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ ఆడుతున్నప్పుడు కేదార్ ప్రతి ఓవర్లోనూ రెండు లేదా మూడు డాట్ బాల్స్ వేయగలడని మాకు ముందే తెలుసు. ప్రత్యర్థి రన్ రేట్ తగ్గించడానకి కేదార్ బౌలింగ్ ఉపయోగపడుతుందని అనుకున్నాం. కానీ జాదప్ మొత్తం గేమ్‌నే టీమిండియాకు అనుకూలంగా మార్చేశాడని కోహ్లీ ప్రశంసలు కురిపించాడు.
 
అనూహ్యంగా వన్డే జట్టు పగ్గాలు కోహ్లీకి వదులుకున్నా.. టీమిండియాలో ధోనీ ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదనడానికి ఇది మరొక ఉదాహరణ. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఫైనల్లో భారత్ తలపడుతున్న నేపథ్యంలో ధోనీ, కోహ్లీ మధ్య ఇలాంటి సమన్వయమే, పరస్పర అవగాహనే కొనసాగాలని కోట్లాది భారతీయులు ప్రగాఢంగా కోరుకుంటున్నారు.