పెళ్లి కాదేమోనని.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. ఎక్కడ?
తెలంగాణా రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. తనకు పెళ్లి కాదన్న భయంతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ నగరంలోని శాలిబండ పోలీసు స్టేషన్ పరిధిలో ఇది జరిగింది. పోలీసులు వెల్లడించిన కథనం మేరకు.. రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, జైత్వారం గ్రామానికి చెందిన పర్వతాలు కుమార్తె డి.సురేఖ (28) ఛత్రినాక పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ అలియాబాద్ కాల్వగడ్డ ఏడు గుళ్ల ప్రాంతంలో తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఉంటోంది.
2018 బ్యాచ్‌కు చెందిన సురేఖ (డబ్ల్యూపీసీ 30259) ఇటీవల భవానీనగర్ పోలీసు స్టేషన్‌కు బదిలీ అయినప్పటికీ ఇంకా ఇక్కడి నుంచి రిలీవ్ కాలేదు. గతేడాది సురేఖకు పెళ్లి సంబంధం కుదిరి కొన్ని కారణాల వల్ల రద్దయింది. తాజాగా ఈ నెల 1న తమ స్వగ్రామానికి చెందిన ఓ యువకుడితో సురేఖకు నిశ్చితార్థం జరిగింది.
అయితే, నిశ్చితార్థం జరిగాక పెళ్లి కుమారుడు పెళ్లి కూతురికి వరుసకు కొడుకు అవుతాడని, జాతకాలు కూడా కుదరడం లేదని ఇరుకుటుంబాలు చర్చించుకుంటుండటంతో ఈ సంబంధం కూడా రద్దయి.. తనకు ఇంకా పెళ్లి జరగదేమోనని మనస్తాపానికి గురైంది.
ఈనెల 2న సురేఖ సోదరి ఉద్యోగానికి వెళ్లి 3న ఉదయం 11 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటి తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉండడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్థానికులు తలుపులు బద్దలుకొట్టి చూడగా సురేఖ సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించింది. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు.