శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (08:24 IST)

ప్రియుడి కోసం భర్తను చంపేసిన భార్య... ఎక్కడ?

murder
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలో తన ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించేందుకు వీలుగా కట్టుకున్న భర్తను భార్య హత్య చేయించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, సిద్ధిపేట జిల్లాకు చెందిన సందిరి స్వామి - కావ్యలు దంపతులు. వీరిద్దరూ బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని బాలాజీ నగర్‌‍లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో స్వామి స్థానికంగా ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 
 
అయితే, స్వామి ఇంటికి ఎదురుగా నివాసం ఉంటున్న ప్రణయ్‌ కుమార్‌తో కావ్యకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత అక్రమ సంబంధానికి దారితీసింది. గత యేడాది కాలంగా ఇద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అదేసమయంలో కావ్య నుంచి ప్రణయ్ తన అవసరాల కోసం డబ్బు తీసుకోవడం ప్రారంభించాడు. 
 
తొలుత తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలు అమ్మి అతనికి డబ్బు సమకూర్చింది. మరోసారి రూ.5 లక్షల నగదు ఇచ్చింది. అయినా మరికొంత డబ్బు కావాలని అడగడంతో రూ.3 లక్షలు పిరమిల్ అనే లోన్‌యాప్‌లో రుణం తీసుకుని ఇచ్చింది. ఇలా పలు విడతలుగా రూ.10 లక్షలు సమకూర్చింది. ఆమె ఇచ్చిన డబ్బుతో ప్రణయ్ జల్సాలు చేయసాగాడు. ఇద్దరి అక్రమ సంబంధంపై భర్త స్వామికి అనుమానం రావడంతో కావ్యను మందలించాడు. పలుమార్లు ఆమెతో గొడవపడ్డాడు. ఆ విషయాన్ని కావ్య ప్రణయ్ చెప్పింది. స్వామిని అడ్డు తొలగిస్తే ఇద్దరం సంతోషంగా ఉండొచ్చని కావ్య తెలిపింది. దీంతో అతన్ని హత్య చేసేందుకు పథకం వేశారు.
 
హత్య చేసేందుకు ప్రణయ్ కుమార్ అతని స్నేహితుల సహాయన్ని కోరాడు. నిజామాబాద్‌కు చెందిన రోహిత్, జవహర్ నగర్‍‌‌కు చెందిన నగేశ్‌లకు విషయం చెప్పాడు. జనవరి 26వ తేదీన స్నేహితులతో కలిసి అనంతపూర్ విహార యాత్రకు వెళ్తున్నామని స్వామికి తెలిపాడు. తమ కారుకు డ్రైవర్‌గా వస్తే రోజు కూలీ ఇస్తామని తెలపగా స్వామి అంగీకరించాడు. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి స్వామిని ప్రణయ్ చంపేశాడు. 
 
ఈ క్రమలో గత నెల 28వ తేదీన తూముకుంట నుంచి జవహర్ నగర్‌కు వెళ్తున్న సమయంలో అటవీ ప్రాంతంలో శవం ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో పాటు, సాంకేతికత సాయంతో ప్రధాన నిందితుడు ప్రణయ్, రోహిత్, నగేశ్‌ను అరెస్టు చేశారు. మృతుని భార్య కావ్య పరారీలో ఉంది. నిందితుల నుంచి కారు, నాలుగు చరవాణిలను స్వాధీనం చేసుకున్నారు.