బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 మే 2023 (10:52 IST)

ఆరు గంటలు ఇంట్లో ఉండి రూ.10 లక్షలతో ఉడాయించిన వైనం

thieves
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఈ నెల 11వ తేదీన చోటుచేసుకున్న దోపిడీ కేసులో నిందితుడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెల్లడైన వివరాల మేరకు.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు-52లో నివసించే వ్యాపారి ఎన్‌ఎస్‌ఎన్‌ రాజు ఇంట్లోకి ఆగంతుకుడు ప్రవేశించి గర్భిణి అయిన ఆయన కుమార్తె నవ్య మెడపై కత్తి పెట్టి నగదు దోచుకెళ్లిన సంగతి విదితమే. 
 
అర్థరాత్రి దాటాక ఇంట్లోకి ప్రవేశించి ఆరు గంటలకు పైగా అక్కడే ఉండి, మద్యం తాగి, నగదు తీసుకొని జారుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 15 రోజులుగా నిందితుడి కోసం వెతుకున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలించడంతో పాటు వేలిముద్రలు సేకరించారు. 
 
వేలిముద్రలు లభ్యం కాకపోవడంతో సాంకేతికత ఆధారంగా నిందితుడు సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన మోతీరాం రాజేష్‌యాదవ్‌గా గుర్తించారు. శామీర్‌పేట సమీపంలోని ఒక రిసార్ట్‌లో స్నేహితులకు విందు ఇస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. నిందితుడు రూ.2.50 లక్షలతో రాయల్‌ ఎన్‌ఫిల్డ్‌ వాహనాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వాహనంతో పాటు కొంత నగదును స్వాధీనం చేస్తున్నట్లు సమాచారం.
 
రాజేష్‌యాదవ్‌కు అప్పుల బాధ ఎక్కువ కావడంతో దొంగతనం చేసి తీర్చాలనుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని పలు ఇళ్లను పరిశీలించాడు. అన్నింటికి గోడలు ఎత్తుగా ఉండి, కాపలాదారులు సైతం ఉండటాన్ని గుర్తించాడు. ఈ క్రమంలో ఎన్‌ఎస్‌ఎన్‌ రాజు ఇంటి గోడలు ఎత్తు తక్కువగా ఉండటంతో లక్ష్యంగా చేసుకున్నాడు. 
 
నిచ్చెన సాయంతో లోపలికి ప్రవేశించాడు. రాజు కుమార్తె మెడపై కత్తి పెట్టి నగదు కావాలంటూ డిమాండ్‌ చేశాడు. ఆభరణాలు ఇచ్చినా తిరస్కరించాడు. తొలుత పాతిక లక్షలు డిమాండ్‌ చేసి, చివరకు ఇంట్లో ఉన్న రూ.2 లక్షలతో పాటు, బయటి నుంచి అల్లుడు పంపించిన రూ.8 లక్షలు కలిపి మొత్తం రూ.10 లక్షలతో ఉడాయించాడు.
 
ముందే ప్రణాళిక.. చోరీ చేయడం తొలిసారి కావడంతో ముందుగా దానిపై అవగాహన పెంచుకున్నాడు. తన చరవాణి నుంచి ఫోన్‌ చేస్తే తెలుస్తుందని.. నవ్య చరవాణి నుంచి క్యాబ్‌ బుక్‌ చేసుకొని షాద్‌నగర్‌ వెళ్లాడు. అక్కడ షాపింగ్‌ చేస్తూ సీసీ కెమెరాల్లో చిక్కి, తాను వేరే ప్రాంతానికి వెళ్లడానికి అవసరమైన సామగ్రి కొనుగోలు చేసినట్లుగా పోలీసులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. 
 
అక్కడి నుంచి మరో క్యాబ్‌లో రాంగోపాల్‌పేటలోని తన నివాసానికి వెళ్లాడు. నిందితుడి కదలికల ఆధారంగా వేరే రాష్ట్రానికి పారిపోయి ఉంటాడని భావించి అటువైపు దృష్టి సారించారు. ఈ కేసులో దాదాపు 30 మంది పోలీసు అధికారులు నిందితుడిని గుర్తించేందుకు శ్రమించారు.