ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 మార్చి 2023 (13:53 IST)

చదువుకోమని చెప్పారని తొమ్మిదేళ్ల చిన్నారి సూసైడ్

suicide
తన స్నేహితులతో తిరగకుండా బుద్ధిగా చదువుకోమని చెప్పినందుకు తొమ్మిదేళ్ల బాలిక ఒకరు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తమిళనాడులోని తిరువళ్లూర్‌‌కు చెందిన చిన్నారి ప్రతిక్ష నాలుగో తరగతి చదువుతోంది. ఇన్‌స్టాగ్రాంలో రీల్స్‌ చేస్తూ సరదాగా గడిపే తనని ఇరుగుపొరుగు వారు, స్నేహితులు రీల్స్‌క్వీన్‌ అని పిలుస్తుంటారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బంధువుల ఇంటి ముందు స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా... తల్లిదండ్రులు కృష్ణమూర్తి, కర్పగం చిన్నారిని ఇంటికి వెళ్లి చదువుకోమని హెచ్చరించారు.
 
చిన్నారికి  తాళాలు ఇచ్చి వారు మార్కెట్‌కు వెళ్లారు. దీంతో మనస్తాపం చెందిన చిన్నారి కిటికీ చువ్వకు తువ్వాలుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దాదాపు గంట తర్వాత తిరిగొచ్చిన తల్లిదండ్రులు తలుపులు లోపలి నుంచి గడియపెట్టి ఉండటం గమనించారు. 
 
తలుపును తీయమని కుమార్తెను కోరగా తను ఎంతకీ స్పందించలేదు. దీంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఆచేతన స్థితిలో ఉన్న తమ కుమార్తెను చూసి బిత్తరపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. 
 
అప్పటికే ఆలస్యమవడంతో చిన్నారి మృతి చెందింది. కేసు నమోదు చేసిన తిరువళ్లూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుల ముందు తల్లిదండ్రులు తిట్టారనే కోపంతోనే చిన్నారి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు తెలిపారు.