బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 జూన్ 2023 (14:41 IST)

మహిళా ప్రయాణికురాలితో క్యాబ్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన

woman victim
బెంగళూరులో ఓ మహిళా ప్రయాణికురాలితో క్యాబ్‌ డ్రైవర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. క్యాబ్‌లో ఆమె ఒక్కరే ప్రయాణిస్తుండడంతో అదును చూసి ఆమె పట్ల అనుచితంగా వ్యవహరించాడు. ఈ ఘటనతో హతాశుయురాలైన ఆమె సామాజిక మాధ్యమమైన లింక్డ్‌ఇన్‌లో తనకెదురైన అనుభవాన్ని పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌ వైరల్‌ అవ్వడంతో ఉబర్‌ సంస్థ స్పందించడంతో పాటు డ్రైవర్‌పై చర్యలు తీసుకుంది.
 
బెంగళూరుకు చెందిన ఓ మహిళ బీఎటీఎం రెండో స్టేజీ నుంచి జేపీ నగర్‌ మెట్రో వరకు ఇటీవల క్యాబ్‌ బుక్‌ చేసుకున్నారు. రైడ్‌ మొదలైన కాసేపటికి డ్రైవర్‌ వేరే రూట్‌లో వెళ్లడాన్ని ఆమె గుర్తించారు. డ్రైవర్‌ అనుమానాస్పదంగా వ్యవహరించడంతో ఆమె ఉబర్‌ యాప్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మళ్లీ నిర్దేశిత రూట్లో ప్రయాణించడం మొదలు పెట్టాడు. 
 
ఎందుకైనా మంచిదని రైడ్‌ను ముందుగానే ముగించాలని ఆ మహిళ నిర్ణయించుకున్నారు. కారు ఆపమని సూచించి అతడికి డబ్బులు చెల్లించారు. డబ్బులు తీసుకున్నాక ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఆమె ప్రైవేటు పార్టులపై చేతులు వేశాడు. ప్రతిఘటించడంతో ఆమెపై చేయి చేసుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి ఆ మహిళ బయటపడింది. జనసంచారం ఎక్కువగా ఉన్న చోటుకు పరుగులు తీసింది.
 
తనకు ఎదురైన అనుభవాన్ని వెంటనే లింక్డ్‌ఇన్‌లో పోస్ట్‌ చేశారు. తన వస్తువులను సైతం కారులో మరిచిపోయానని అందులో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ వైరల్‌ కావడంతో ఉబర్‌ వెంటనే స్పందించింది. డ్రైవర్‌పై చర్యలు చేపట్టింది. 
 
ఈ విషయాన్ని సైతం ఆమె లింక్డ్‌ఇన్‌ ద్వారా పంచుకున్నారు. తాను పోస్ట్‌ పెట్టిన వెంటనే సత్వరమే స్పందించినందుకు ఉబర్‌కు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 
క్యాబ్స్‌లో ప్రయాణించే మహిళల పట్ల డ్రైవర్లు అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు కొత్త కాదు. అందుకే ఒంటరిగా ప్రయాణించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉబర్‌ సూచిస్తోంది. 
 
ట్రిప్‌ను ఇతరులతో పంచుకోవడంతో పాటు తమ యాప్‌లో ఉండే రైడ్‌ చెక్‌ 3.0 వంటి ఫీచర్లను వినియోగించుకోవాలని సూచిస్తోంది. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తమ కస్టమర్ కేర్‌కు గానీ, పోలీసులకు గానీ కాల్‌ చేయాలని పేర్కొంది.