శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 మార్చి 2023 (13:27 IST)

ఈఎంఐ చెల్లించేందుకు డబ్బులు ఇవ్వలేదనీ తండ్రిని సుత్తితో కొట్టి చంపిన తనయుడు.. ఎక్కడ?

crime scene
ఈఎంఐ చెల్లించేందుకు డబ్బులు ఇవ్వకపోవడంతో కన్నతండ్రిని తనయుడు సుత్తితో కొట్టి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గోరఖ్‌పూర్ జిల్లాకుచెందిన సంతోష్ కుమార్ గుప్తా అనే వ్యక్తి ఇటీవల ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేశాడు. దీనికి నెలవారీ ఈఎంఐ చెల్లించేందుకు డబ్బులు ఇవ్వాలని తండ్రిని కోరగా ఆయన నిరాకరించాడు. దీంతో తనకు ఆస్తి పంచివ్వాలని ఒత్తిడి చేయడంతో కుటుంబంలో ఆస్తి తగదాలు తలెత్తాయి. 
 
ఈ నేపథ్యంలో కన్నతండ్రి  62 యేళ్ల మురళీధర్ గుప్తాను తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే, సూట్‌కేసులో మృతదేహం పట్టకపోవడంతో మృతదేహాన్ని ముక్కలుగా నరికి అందులో కుక్కాడు. ఈ దారుణ ఘటన తివారిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరజ్ కుండ్ కాలనీలో జరిగింది. తన తండ్రి హత్యకు గురయ్యాడన్న వార్త తెలుసుకున్న మరో కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
శరీర భాగాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు వెల్లడించారు ఆస్తి వివాదంలో తండ్రీ కొడుకుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని, ఈ కారణంగానే తండ్రిని కుమారుడు హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా, సంతోష్ కుమార్ గుప్తా కొనుగోలు చేసిన మోటార్ బైకుకు నెలవారీ ఈఎంఐలు చెల్లించేందుకు డబ్బులు ఇవ్వకపోవడంతో తండ్రికొడుకుల మధ్య ఆస్తి గొడవ మొదలైంది.