బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 27 జులై 2022 (23:33 IST)

విశాఖ మిస్సింగ్ కేసు ట్విస్ట్: నాన్నా నన్ను వెతకొద్దు, బెంగళూరులో వున్నా.. చనిపోను కానీ...

saipriya
విశాఖ మిస్సింగ్ కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. అధికారులు మిస్సింగ్ అయిన సాయిప్రియ నెల్లూరులో వుందని అనుకుంటుండగా ఆమె తను బెంగళూరులో వున్నట్లు తన తండ్రి వాట్సప్‌కి సందేశం పంపింది.

 
ఆ సందేశంలో తనకి చనిపోవాలని లేదని, తను ప్రేమించిన వ్యక్తి రవితోనే వున్నట్లు వెల్లడించింది. తనకు ఇంకా పరుగెత్తే ఓపిక లేదనీ, తనను వెతకవద్దనీ, వెతికితే ఇద్దరం కలిసి చనిపోతామంటూ రాసింది. తన గురించి విశాఖ సముద్ర తీరం అంతా గాలించిన అధికారులకు క్షమాపణలు వేడుకుంటున్నట్లు తెలిపింది. రవిని నేను ఎన్నాళ్లగానో ప్రేమిస్తున్నాననీ, తామిద్దరం ఒకర్ని విడిచి మరొకరం వుండలేమనీ, ఇందులో రవి తల్లిదండ్రులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.

 
కాగా వివాహానికి ముందే ప్రియ రెండుసార్లు తన ప్రియుడు రవితో కలిసి పారిపోయింది. ఆ తర్వాత తల్లిదండ్రులు, బంధువులు ఒత్తిడి చేయడంతో సాయిప్రియ బలవంతంగా శ్రీనివాస్‌ను పెళ్లి చేసుకుంది. కానీ ప్రియుడిని మాత్రం మరిచిపోలేక పోయింది. ఈ క్రమంలో శ్రీనివాస్ హైదరాబాద్ నగరంలోని ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తుండటంతో అక్కడే కాపురం పెట్టింది. అదేసమయంలో తన ప్రియుడితో మాత్రం టచ్‌లో ఉంటూ వచ్చింది. నాలుగు నెలల క్రితం కంప్యూటర్ కోర్సు చేయాలంటూ హైదారాద్ నగరం నుంచి విశాఖకు వచ్చింది.

 
ఈ నెల 25వ తేదీన పెళ్లిరోజు వేడుక చేసుకునేందుకు శ్రీనివాస్ విశాఖకు వచ్చారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లారు. ఈ విషయాన్ని ముందుగానే తన ప్రియుడు రవికి సాయిప్రియ సమాచారం ఇచ్చింది. అక్కడ నుంచి పక్కా ప్లాన్‌తో సాయిప్రియ తన ప్రియుడు రవితో కలిసి పారిపోయింది. తన భార్య కనిపించకపోవడంతో శ్రీనివాస్ తీవ్ర ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నావికా సిబ్బంది సహకారంతో హెలికాప్టరు ద్వారా కూడా గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇందుకుగాను కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం.