ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు ఎందుకింత ఆరాటం

chandrababu
జె| Last Modified శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (14:35 IST)
సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ఆరునెలలకు ముందు బిజెపి, టిడిపి రెండు పార్టీలు విడిపోయాయి. ఒకప్పుడు రెండు పార్టీల నేతలు బాగానే కలిసి ఉన్నారు. బిజెపి హయాంలో రెండు కేంద్రమంత్రి పదవులు కూడా టిడిపి నేతలకు ఇచ్చారు. ఢిల్లీలో చక్రం తిప్పేందుకే రెండు కేంద్రమంత్రి పదవులతో పాటు మరికొన్ని పదవులను కూడా తీసుకున్నారు.

అప్పట్లో బిజెపి-టిడిపి మధ్య సఖ్యత బాగానే కొనసాగింది. కానీ ఆ తరువాత రానురాను నేతల మధ్య మాటల యుద్థం ప్రారంభమై చివరకు కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేసే స్థితికి వచ్చేసింది. ఇక తెగతెంపులే చివరకు మిగిలాయి. రెండు పార్టీలు పూర్తిగా విడిపోయాయి. అంతటితో ఆగలేదు బిజెపి.. టిడిపి నేతల మధ్య మాటల యుద్ధం పెద్ద ఎత్తున సాగింది.

అయితే పార్టీలు విడిపోయిన తరువాత చంద్రబాబుకు నరేంద్రమోడీకి మధ్య అస్సలు మాటల్లేవు. కానీ ప్రస్తుతం ఒక విపత్కరమైన పరిస్థితిలో ఇద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. కరోనా వైరస్ బారి నుంచి
ఏ విధంగా తప్పించుకోవాలని, ప్రజలను ఎలా సురక్షితంగా కాపాడాలో తెలియజేస్తూ రెండు, మూడు సూచనలను పిఎంఓ కార్యాలయానికి చంద్రబాబు పంపారు.

అంతటితో ఆగకుండా పిఎంఓ కార్యాలయ సిబ్బందితో మాట్లాడిన చంద్రబాబు ప్రధానమంత్రితో మాట్లాడాలని కోరారు. అయితే పిఎంఓ సిబ్బంది ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళతామని.. ఆయన మాట్లాడతారని చెప్పారు. దీంతో చంద్రబాబు సలహాలు విన్న మోడీ స్వయంగా బాబుకు ఫోన్ చేసి నాలుగు నిమిషాల పాటు మాట్లాడారట.

చాలారోజుల పాటు ఇద్దరు నేతల మధ్య ఎలాంటి మాటలు లేకుండా ఉంటే ఒక్కసారిగా తాజాగా మాటలు కలవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. కేంద్రంలో బిజెపికి దగ్గరైతే మంచిదని.. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మోడీకి దగ్గరవ్వాలని చంద్రబాబు ఆలోచనలో ఉన్నారట. అందుకే ఇప్పటి నుంచే మోడీకి దగ్గరయ్యే ప్రయత్నం ప్రారంభించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ స్కెచ్ బాగానే ఉన్నా ఎపిలో ఉన్న బిజెపి నేతలు మాత్రం టిడిపిని దగ్గర చేర్చుకునేందుకు ఇష్టపడటం లేదు. అస్సలు మోడీ చంద్రబాబుకు ఫోన్ చేయలేదంటున్నారు బిజెపి నేతలు.దీనిపై మరింత చదవండి :