ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 1 జులై 2021 (16:50 IST)

వ్యభిచారుల కోవిడ్ క‌ష్టాలు, కుప్పల్లా పేరుకున్న అప్పులు

వాళ్ళ వృత్తి ధ‌ర్మ‌మే అది. అలా చేస్తే గాని వారికి ముద్ద దిగ‌దు. కానీ, కరోనా వారి పాలిట తీవ్ర శాపంగా మారింది. సోష‌ల్ డిస్టెన్స్, భౌతిక దూరం వారి వృత్తికి గొడ్డ‌లిపెట్టుగా మారింది. కోవిడ్ 19 వ‌ల్ల గ‌త ఏడాదిన్న‌ర‌గా అన్ని రంగాలు దెబ్బ‌తిన్నాయి. కానీ, ప్ర‌త్య‌క్షంగా దెబ్బ‌తిన్న వారే వ్యభిచారులు. సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డంతో వారి వృత్తి క‌రువైంది. వృత్తి మానేద్దామ‌ని చిరు వ్యాపారాలు ప్రారంభిస్తే, లాక్ డౌన్ల భుక్తి క‌ర‌వైంది.
 
కోవిడ్ -19 కష్టాలు దేశవ్యాప్తంగా సెక్స్ వర్కర్ల జీవితాలను దెబ్బతీశాయి. ఆంధ్రప్ర‌దేశ్ లోనూ సెక్స్ వర్కర్ల దుస్థితి కూడా ఇదే. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ల‌క్షా 20 వేల మంది సెక్స్ వర్కర్లు గత రెండేళ్లుగా ఆకలితో అల‌మ‌టిస్తున్నారు. సెక్స్ వ‌ర్క‌ర్ల‌ను ఆ వృత్తి నుంచి బ‌య‌ట ప‌డేయాల‌ని రెండేళ్ళ క్రితం కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌లు వారికి ప్ర‌యివేటు రుణ స‌దుపాయం కూడా క‌ల్పించాయి. ఇపుడు ఆ అప్పులు కూడా క‌ట్ట‌లేని దుస్థితికి సెక్స్ వ‌ర్క‌ర్లు చేరార‌ని విముక్తి సంస్థ రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి మెహరున్నీసా వెబ్ దునియాకు తెలియ‌జేశారు.
 
కోవిడ్ సమయంలో సెక్స్ వర్కర్స్ కష్టాలు తీర్చ‌డానికి సుప్రీమ్ కోర్ట్ తీర్పును అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ నేపధ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కొన్ని సూచ‌న‌లు చేసింది. సెక్స్ వర్కర్స్‌కు అన్ని రకాల కార్మికులకు వలె రేషన్, ఆర్థిక సహాయం, ఒంటరిగా చిక్కుకున్న వారికి రవాణా సౌకర్యాలు, మాస్కులు, శానిటైజర్లు, ఆరోగ్య సలహాలు అందించాలని రాష్ట్ర‌ ప్రభుత్వాలను ఆదేశించింది.
 
ఈ విధ‌మైన స్పష్టమైన సలహా ద్వారా భారతదేశంలోని అంద‌రు కార్మికులకు లభించే అన్ని హక్కులు సెక్స్ వర్కర్లకు విస్తరించవచ్చని జాతీయ మానవ హక్కుల సంఘం కూడా పేర్కొంది. మరో కేసులో కోవిడ్ రిలీఫ్ సపోర్ట్ సర్వీసెస్ కింద లాక్ డౌన్ వ్యవధిలో సెక్స్ వర్కర్లకు ఉచిత రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వాల‌కు సుప్రీంకోర్టు సూచించింది. కానీ, ఎక్క‌డా ఈ సూచ‌న‌లు అమ‌లు కావడం లేదు. సెక్స్ వర్కర్లు, అక్రమ రవాణా నుండి బయటపడిన యువ‌త‌ల‌పై కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ “విముక్తి “, హెల్ప్, తఫతీష్ అనే సంస్థలు కలిసి ఇటీవల ఒక సర్వే నిర్వహించాయి.
 
ఇందులో 90 శాతం మంది సెక్స్ వర్కర్లు అప్పుల వలలలో చిక్కుకుపోయార‌ని ఈ సర్యే ద్వారా గుర్తించారు. చాలామంది సెక్స్ వ‌ర్క‌ర్లు ఆ ఊబి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు... చిన్న‌చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు అప్పులు చేశారు. అందులో కొంద‌రు అనేక మైక్రో ఫైనాన్స్ సంస్థ‌ల నుంచి రుణాలు తీసుకున్నారు. ఈలోగా క‌రోనా ముంచుకొచ్చి.... లాక్ డౌన్లు ప్ర‌క‌టించ‌డంతో వారి చిన్న చిన్న వ్యాపారాలు బంద్ అయ్యాయి.
 
మానవ అక్రమ రవాణా నిరోధానికి అప్పులు ఇస్తే, బాగుప‌డ‌తారు అనుకుంటే, వారిపై లాక్డౌన్ల యొక్క ఆర్థిక ప్రభావం తీవ్రంగా ప‌డింద‌ని బహుళ రాష్ట్ర సర్వేలో తేలింది. విముక్తి సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, గుంటూరు, కృష్ణ జిల్లాలకు చెందిన 142 మంది సెక్స్ వర్కర్ల నుంచి వివ‌రాల‌ను సేక‌రించింది. కోవిడ్ మొదటి వేవ్ సమయంలో మొత్తం 116 మంది సెక్స్ వర్కర్లు , ప్రస్తుత రెండవ కోవిడ్ సందర్భంగా 142 మంది సెక్స్ వర్కర్ల నుండి డేటాను సేకరించారు.
 
ఈ తాజా సర్వే ప్రకారం, అందులో 99 శాతం మంది ఇప్పటికీ రుణదాతలకు రుణపడి ఉన్నారు. వారు సగటున రూ.52, 350/-  కనిష్టంగా 5,000 రూపాయల నుండి గరిష్టంగా 4,30,000 రూపాయల వరకు రుణాలు తీసుకున్నారు, ఇప్పటికీ వీరు అప్పులు, అధిక వ‌డ్డీలతో కొనసాగుతున్నారు.
 కోవిడ్ రెండో వేవ్ స‌మ‌యంలో సర్వే చేసిన 142 మందిలో 70 శాతం మంది అప్పుల్లో ఉన్నారు, వారిలో కొందరు రెండవ వేవ్ సమయంలోనే ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకొన్నారు, వీరిలో అత్యధిక రుణం 4,30,000/- మరియు వడ్డీ రేటు నెలకు 15 నుండి 20% వ‌ర‌కు ఉంది. వీరంతా తిరిగి కోలుకోవాలంటే, కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంది.