ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషల పరిరక్షణార్థం ‘‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్స వం''(ఫిబ్రవరి 21) ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ(విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ) యునెస్కో ప్రకటించింది. మాతృభాష కోసం కొంతమంది బెంగాలీ విద్యార్థులు పోరాడి ప్రాణాలను కోల్పోయారు. వారి త్యాగానికి నివాళిగా ఆ రోజున కనీసం అమ్మ భాష గురించి ఆలోచించి ప్రణాళిక వేసి మాతృభాషల మనుగడకు ఆయా భాషలు మాట్లాడేవారు పూనుకోవాలన్న ఉద్దేశంతోనే దీనిని ప్రకటించారు.
యునెస్కో సర్వేలో ఆంగ్లభాష అనే రోడ్డు రోలరు కిందపడి బక్కచిక్కిన మాతృభాషలెన్నో నలిగి కనుమరుగైపోయాయని తేలింది. ప్రపంచంలో సుమారు 7105 భాషల్లో, 230 భాషలు అంతరించాయి. ఇంకా 2956 భాషలు అంతరించే దశలో ఉన్నాయని యునెస్కో వెల్లడించింది. ఈ భాషల జాబితాలో తెలుగు భాష ఉందని యునెస్కో ప్రకటించింది. ఒక భాషను మాట్లాడే జనాభాలో ముప్ఫై శాతం మంది ఆ భాషను చదవకుండా, తల్లి భాషకు దూరమైతే ఆ భాష కాలక్రమంలో మృతభాషగా మారుతుందని యునెస్కో సూత్రీకరించి, తెలుగుకు ఆ పరిస్థితి రాబోతుందని ప్రకటించింది. ఇది తెలుగు భాషాభిమానులను కలవరపర్చే విషయం.
శిశువుకి తొలి గురువు అమ్మ. ఆ అమ్మ ఒడి నుంచి నేర్చుకునే భాష మాతృభాష. అప్రయత్నంగా, ఏ ఇబ్బందీ లేకుండా నేర్చుకునే భాష ఇదే. దీని ద్వారానే రసానుభూతి, ఉత్తమ సంస్కారం, మానవతా విలువలు, సామాజిక నైతిక విలువలు పెంపొందుతాయి. భాష ఒక సమాజపు సొత్తు. ప్రతి తరం ఆ అద్భుత సంపదను కాపాడడానికి తమ వంతు కృషి చేస్తూనే ఉండాలి. బిడ్డ శారీరకంగా ఎదగడానికి తల్లిపాలు ఎంత అవసరమో, మానసిక ఎదుగుదలకు అమ్మభాష కూడా అంతే అవసరం. భాషను బట్టే జాతి గుర్తించబడుతుంది. కాలగమనంలో రాజ్యాల సరిహద్దులు, పాలకులు మారినా ఆయా జాతుల మాతృభాషలు మారవు. పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ ఇందుకు ఒక ఉదాహరణ. మన దేశంలోనే మన తెలుగు జాతిలోనే ఇటీవల రాష్ట్ర విభజన ఫలితంగా ఏర్పడిన ఆంధ్ర-తెలంగాణలు మరొక ఉదాహరణ.
'నిజమైన భావ ప్రేరేపణ, ప్రగతి, మాతృభాష వల్లనే వస్తుందని, స్వభాషలో విద్య ఉంటే, స్వరాజ్యం ఎప్పుడో వచ్చేదని' గాంధీజీ 1938లోనే చెప్పారు. మాతృభాషలో విద్యను బోధిస్తే మానసిక వికాసానికి, సంపూర్ణ మూర్తిమత్వానికి దోహదం చేస్తుంది. 'పరభాషలో విద్య నేర్చుకోవడం మెట్లులేని మేడ' లాంటిదంటాడు ఠాగూర్. 'తల్లిపాల వంటిది మాతృభాష- పోతపాల వంటిది పరభాష' అంటారు కొమర్రాజు వారు. ఇక మన మాతృబాష విషయానికొస్తే 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని కీర్తించాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇతర బాషలలో లేని స్పష్టత, అవగాహనా సౌలభ్యం తెలుగు బాషకు ప్రత్యేక లక్షణాలుగా భాషిస్తాయి. 'చక్కెర పొంగళి తీపిరుచులు/ చక్కిలాల కరకరలు/ కోయిలమ్మ కుహుకుహులు/ మైనాపక్షి మధుర పలుకులు/ తన మనసు నిండా పొదుపుకున్న/ పచ్చిపాల మీగడంటి అచ్చమైన భాష/ అదే అదే మన మాతృభాష..' అంటారో కవి.
మెకంజి, వాకర్ లాంటి భాషా శాస్తవ్రేత్తలు మొదట నేర్చుకునే మాతృభాష ఎంత గట్టిగా నేర్చుకుంటే దాని ద్వారా ఇతర భాషల్ని అంత గట్టిగా నేర్చుకోగలరని నిర్ధారించి చెప్పాడు. సాథియాసీలన్, కీసర్ ఎట్ ఆల్ లాంటి పరిశోధకులు ఇతర భాషలకన్నా మాతృభాషలో నేర్చుకోగల సామర్ధ్యం ఎవరికైనా ఎక్కువగా వుంటుందన్నారు. మాతృభాషలోనే ఆలోచించగలరు, కలలు కనగలరు, ఆ పునాదితోనే భవిష్యత్తులో ధైర్యంగా ముందుకు కదలగలరని పేర్కొన్నారు. ‘మాతృభాష ద్వారా ఎవరైనా తమ గురించి తాము తెలుసుకోగలరు’ అని గిడుగు రామ్మూర్తి అన్నారు.
పాఠశాలలోకి అడుగుపెట్టినప్పుడు అమ్మ లేకుండా అమ్మ భాష లేకపోతే పిల్లలు కంగారుపడతారు. ఈ ప్రపంచంలో మొదట ఏ భాషతో సమాజానికి కలపబడతాడో అదే మాతృభాష. ఆ మాతృభాషే లేకపోతే పాఠశాలకు వెళ్లమని మారాం చేస్తారు. చదువంటే ఒక విధమైన భయం ప్రారంభమవుతుంది. అలా కాకుండా పాఠశాలలోకి వచ్చిన తరువాత ఇంట్లో మాట్లాడే భాషలో బోధన ప్రారంభమైతే ఆ భాషలో రాయడం, చదవడం నేర్చుకునేసరికి కొద్దిగా ఊహ తెలుస్తుంది. ప్రాధమిక పాఠశాల చదువు పూర్తవుతుంది. అక్కడినుంచి ఏ భాషలో విద్యాబోధన జరిగినా జంకు లేకుండా మాతృభాష ద్వారా ఆ భాష నేర్చుకోగలుగుతారు. ఆ భాషలో విద్యని తేలికగా కొనసాగించగలుగుతారు.
కనీసం ఐదవ తరగతి దాకా విద్యార్ధులందరూ మాతృభాషా మాధ్యమంలోనే చదువుకుంటే విద్యార్థుల సాంస్కృతిక నేపథ్యం బలపడుతుంది. మాతృభాషా శక్తి సామర్థ్యాలు తెలుస్తాయి. ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో ఈ మూడు చోట్ల మాతృభాషలోనే అందరు విద్యార్థులు చదువుకొనే మార్పు రావాలి. ఆంగ్లాన్ని ఒక పేపర్ గా చదువుకోవచ్చు. ఆ తరువాత ఎవరిష్టం వారిది. జరుగుబాటు ఉన్న వాళ్ళకు ఆంగ్ల మాధ్యమం, పేదవాళ్ళకు తెలుగు మాధ్యమం అనే పరిస్థితి పోవాలి. అలాగే ప్రతి విద్యాదశలోనూ మాతృభాషను తప్పకుండా అందరూ చదువుకోవడం అవసరం. అన్ని దశలలోనూ మాతృభాషను ప్రథమభాషగా అధ్యయనం చేసుకోవాలి.
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సంవత్సరం నుంచి తెలుగును విధిగా పాఠశాలలోనే కాదు ఇంటర్మీడియెట్ వరకు ఒక సబ్జెక్టుగా బోధించేలా చూస్తామని ఓ తెలుగు రాష్ట్రంలో ప్రకటిస్తే ప్రజలు ఆనంద పడిపోతున్నారంటే ఇంతకు ముందు తెలుగుకి తెలుగు వాళ్లిస్తున్న గౌరవం ఏమిటో మనకు అర్థమవుతుంది. తెలుగు మాతృభాషగా గల మరో రాష్ట్ర ప్రజలు మన రాష్ట్రంలో కూడా తెలుగుభాషను విద్యాసంస్థలలో తప్పక బోధించేట్టు ప్రభుత్వం ప్రకటిస్తే బావుండునని వాపోతున్నారంటే ఆ రాష్ట్రంలో మాతృభాష స్థితి ఇంకా ఎంత అధ్వాన్నంగా వుందో అర్ధమవుతుంది.
యునెస్కో, వరల్డ్‌బ్యాంక్, వరల్డ్ డిక్లరేషన్ ఆన్ ఎడ్యుకేషనల్ ఫరాల్ (ఎఫ్‌ఎఫ్‌ఏ) జనరల్ అసెంబ్లీ లాంటి అంతర్జాతీయ సంస్థలన్నీ పిల్లలకు ప్రాధమిక విద్యని మాతృభాషలో నేర్చుకునే హక్కుందని నిర్ధారించాయి. కనె్వన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ (సిఆర్‌ఎస్) ఆర్టికల్ 29, 1ఓ సెక్షన్ 269లో ఆర్టికల్ 29 ప్రకారం మాతృభాషలోనే నేర్చుకునే తెవివితేటలు ఎక్కువగా వుంటాయని స్పష్టం చేశారు. అందుకని దాని ద్వారా ప్రపంచంలోకి చూసే హక్కు పిల్లలందరికీ వుందని నిర్ధారిస్తున్నాయి. ఏ భాషని మాధ్యమంగా విద్య గరిపించాలనుకుంటున్నామో ఆ భాషని ముందు క్షుణ్ణంగా నేర్పాలి. అందుకు పిల్లలకున్న భాషాపర హక్కుని గుర్తుంచుకోవాలి. డాకర్ ఫ్రేమ్ వర్క్ ఫర్ యాక్షన్ (2000) వరల్డ్ డిక్లరేషన్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ (1990) యునెస్కో లాంటి సంస్థలు పిల్లల భాషాపర హక్కుని తెలియజేస్తున్నాయి. మాతృభాషలో చదువు చెప్పడం, పిల్లలకు వాళ్ల జాతి సంస్కృతుల్ని చెప్పడం కూడా అంటున్నారు భాషా శాస్తజ్ఞ్రులు. ఇలా ఎందరో పరిశోధకులు, శాస్తజ్ఞ్రులు మాతృభాషా ప్రాధాన్యాన్ని చెబుతున్నారు పాఠశాలలో ప్రారంభ దశలో!
ఈ విషయాల్ని మిగతా పరిశోధనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్యాబోధనా పద్ధతుల్ని నిర్మించాలి. తల్లిదండ్రులు ఆలోచించాలి. అంతేకానీ తల్లిదండ్రులు కోరుతున్నారంటూ స్థాయి అందుకోని వయసులోనే చిన్న పిల్లలమీద పరభాషా భారం ప్రభుత్వం మోపకుండా వయసుని బట్టి విద్యావిధానాన్ని రూపొందించాలి. సృజనకూ, అమ్మభాషకూ ఆత్మీయ చుట్టరికం ఉంది. అమ్మభాషలోనే ఆలోచించగలిగినపుడే సృజన పురి విప్పుకుంటుంది. జపాన్, చైనా, రష్యా, జర్మనీ, ఫ్రెంచ్, అరబిక్, పార్సీస్, స్పెయిన్‌లాంటి దేశాలు వారి వారి మాతృభాషల సాయంతోనే ఆర్థికాభివృద్ధి చెంది ఖ్యాతిని గడిస్తున్నాయి. ఇది ఎవరూ కాదనలేని నిజం!
భాష అనేది ఒక సాంస్కృతిక హక్కు. ఆ హక్కు ఎంత ఉన్నతమైనదో, విలువైనదో తెలియక అన్యభాషల ప్రవాహంలో కొట్టుకుపోతూ మాతృభాషకు నీళ్లొదులుతున్న వారిని కాళోజీ ఘాటుగానే విమర్శించాడు. తెలుగు అంటే 'బడి పలుకుల భాష కాదు/ పలుకుబళ్ళ భాష' కావాలని నిర్ద్వంద్వంగా చెప్పాడు. అందుకే మాతృభాషను కాపాడుకోవాలి. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా మేల్కొని తెలుగును బతికించేందుకు పూనుకోవాలి. 'పరిమళాలనెవడాపును,/పైరగాలినెవడాపును' అని సినారె అన్నట్టుగా తెలుగువాడు పిడికిలి బిగిస్తే.. వారి సంకల్పాన్ని ఎవరాపుతారు.
- వ్యాస రచయిత
డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్,
తెలుగు లెక్చరర్,
తెనాలి.