రేవంత్, ఏబీఎన్ రాధాకృష్ణను కలిసింది, అందుకేనా?!!
కొత్తగా పదవిలోకి వచ్చిన రాజకీయ నేతలు పత్రికాధిపతులను, ఛానళ్ళ అధిపతులను కలవడం సర్వ సాధారణం. వాళ్ళ ప్రచారం నిమిత్తం, ప్రెస్ రిలేషన్స్ పాటిస్తుంటారు నేతలన్న తర్వాత. కానీ, తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణను కలవడంలో కొన్ని లోగట్టులున్నాయని తెలుస్తోంది.
మామూలుగా అందరినీ కలుపుకొని పోతున్న కొత్త టీపీసీసీ అధ్యక్షుడు తమ పార్టీ నేతలను కలిసి వారి మద్దతు ముందుగా కూడగట్టే ప్రయత్నం చేశారు. సీనియర్ నేత వి.హెచ్. ని ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు. సొంత పార్టీ నేతలనే కాదు... సొంత పార్టీకి ప్రచార కర్తలను కూడా ఏర్పాటు చేసుకోవాలనే క్రమంలోనే ఏబీఎన్ రాధాకృష్ణను రేవంత్ కలిశారని తెలుస్తోంది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు బాగా దగ్గర అని ఆ పార్టీ నేతలే చెపుతుంటారు. ఇక ఏపీలో చంద్రబాబు ప్రభుత్వాన్ని గతంలో ఏబీఎన్. ఆంధ్రజ్యోతి భుజాన ఎత్తుకుని మరీ ప్రచార బాధ్యత మోసింది. అందుకే, అది ఎల్లో మీడియా అంటూ ఏపీ ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి బాహాటంగానే చురకలు వేస్తుంటారు.
ఆయన సీఎంగా ప్రమాణం చేసిన తొలి రోజునే రెండు పేపర్లు, మూడు ఛానళ్ళు అంటూ, ఈనాడు, ఆంధ్రజ్యోతిలను బాహాటంగానే ప్రస్తావించారు. దీనితో ఏపీలో అంతవరకు సీఎం కార్యాలయంలో చక్రం తిప్పిన ఏబీఎన్ ఆంధ్ర జ్యోతికి ఇపుడు ప్రాముఖ్యం లేకుండా పోయింది. మరో పక్క ప్రతిక్ష నేత చంద్రబాబుకు సపోర్ట్ చేసి, చేసి ఆ పత్రిక కూడా అలిసిపోయినట్లయింది.
ఇక ఇటు తెలంగాణాలో చూసుకున్నా తెలుగుదేశం పూర్తిగా కనుమరుగయిపోవడం, అధికారంలో ఉన్న తెలంగాణా రాష్ట్ర సమితితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణకు సరిగా పొసగకపోవడంతో రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది...సదరు మీడియా సంస్థ పరిస్థితి. ఈ దశలో కేంద్ర రాజకీయాలపై దృష్టి నిలిపి, కాంగ్రెస్ పార్టీకి ఆసరాగా నిలవాలని టీపీసీసీ కొత్త నేత రేవంత్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని కోరుతునట్లు సమాచారం.
మరో పక్క తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా తాను సీఎంగా ఉండగానే, బీజేపీకి కటీఫ్ చెప్పి, కాంగ్రెస్ పార్టీతో దోస్తీకి సిద్ధమయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో కలసి బహిరంగ సభల్లోనూ పాల్గొన్నారు. ఇపుడు తెలంగాణాలో తెలుగుదేశం హవా లేనందున, కేసీయార్ కు చెక్ పెట్టాలంటే కాంగ్రెస్ కు చేయూతనివ్వడమే బెటర్ అనే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇక రేవంత్ రెడ్డి కూడా నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చంద్రబాబుకు బాగా క్లోజ్ కావడంతో... ఇదే ఒరవడిని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారు. ఏదైనా రీజనల్ ల్యాంగ్వేజ్ పత్రిక సపోర్ట్ లేనిదే అధికారం చేజిక్కించుకోవడం కష్టమని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పే సూత్రాన్ని టీపీసీసీ కొత్త అద్యక్షుడు తూ.చా. తప్పకుండా పాటిస్తున్నారని అనుకోవచ్చేమో... ఫలితానికి కాలమే సమాధానం చెపుతుంది.