శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 21 నవంబరు 2020 (20:30 IST)

తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు, జనసేనానికి తిప్పలు (video)

త్వరలో తెలంగాణ జిహెచ్ఎంసి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో అధికార తెరాసతో పాటు కాంగ్రెస్, భాజపా అభ్యర్థులను ప్రకటించడం మొదలుపెట్టాయి. ఐతే భాజపా-జనసేన పార్టీలకు పొత్తు వున్నందున తమతో భాజపా సంప్రదిస్తుందని పవన్ భావించారు. కానీ అలా జరగలేదు. 
 
బిజెపికి జనసేనతో పొత్తు ఉండదని బండి బహిరంగంగా కఠినమైన ప్రకటన చేశారు. ఇది నిజంగా షాకింగ్. జనసేన, బిజెపి బంధం రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు రాజకీయ పార్టీల అవసరాలను తీర్చనుంది. ఈ చట్రంలో, రెండు పార్టీల నాయకులు తమ ప్రకటనలతో జాగ్రత్తగా ఉండాలి. ఐతే బండి సంజయ్ ఇలా ప్రకటించడంతో జనసేన ఆత్మరక్షణలో పడిపోయింది. దాంతో జనసేన అధినేత పవన్ కూడా వెంటనే స్పందించాల్సి వచ్చింది. అభ్యర్థులను కూడా ఎంపిక చేసి నామినేషన్లు వరకూ వెళ్లారు.
 
ఐతే విషయాన్ని తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. దానితో జనసేన వెనక్కి తగ్గింది. ఐతే ముందటిరోజు తెలంగాణలో పోటీ చేస్తామని చెప్పిన పవన్, తెల్లారేసరికి భాజపా అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని చెప్పాల్సి వచ్చింది. ఇది నిజంగా జనసేనకు ఇబ్బందికరమే. ఇదంతా బండి సంజయ్ మనస్తత్వం కారణంగా ఏర్పడిందనీ, తెలంగాణలో భాజపాకు దెబ్బతీసే విధంగా ఆయన చేసిన ప్రకటన వుందంటూ పార్టీలోని కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. 
 
అంతేకాదు, సిఎం కెసిఆర్‌ను దేశ ద్రోహి అంటూ పెద్ద పదాన్ని వాడుతూ ఆరోపణలు చేసారు. ఇది కూడా మరో ఇబ్బందికరమైన ప్రకటన. తెలంగాణలో బిజెపికి తగినంత నష్టం కలిగిస్తుంది. ఏదో దుబ్బాకలో గెలిచాము కనుక రాష్ట్ర వ్యాప్తంగా భాజపా బలంగా వుందని అనుకుంటే అది పొరబాటవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా బండి సంజయ్ ప్రకటనలు చేసేటపుడు కాస్త చూసుకుని చేస్తే మంచిదని హెచ్చరిస్తున్నారు.