శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (18:58 IST)

దీపావళి నుంచి కార్తీక మాసమంతా దీపాలు వెలిగిస్తే..?

Diwali
నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. 
 
దీపావళి పండుగ ప్రతి ఏడాదిటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు. దీపాలంకరణ, లక్ష్మీ పూజ దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. 
 
మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. ఈ దీపావళి శరదృతువులో రావడం చేత విశేషం. 
 
దీపాల పండుగ దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి వచ్చి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వెస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. 
 
ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. 
 
తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ త్రిలోకాథిపతీ "నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలిని అవుతాను అని సమాధానమిచ్చింది. 
 
అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం. నరక చతుర్దశి కృష్ణుడు మరియు సత్యభామ కలిసి నరకాసురడి సైన్యాలతో పోరాడుతున్న చిత్రం.ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది.