శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ఫెంగ్ షుయ్
Written By Selvi
Last Updated : సోమవారం, 14 జులై 2014 (17:09 IST)

ఫెంగ్‌షుయ్ : గది మూలలో కాస్త ఉప్పు చల్లి ఉంచితే?

ఒక చోటులో అడుగు పెట్టగానే ఒక ప్రత్యేక భావం కలగటం దాదాపు మనందరికి నిత్యం అనుభవంలోకి వస్తున్న విషయమే. అక్కడినుంచి కదలకుండా అలానే ఉండిపోవాలనిపిస్తుంది. లేదా వీలైనంత త్వరగా అక్కడినుంచి బయటపడాలనిపిస్తుంది. లేదా ఇలాంటి చోటు మనకూ సొంతమైతే ఎంత బావుణ్ణు అనిపిస్తుంది. వైవిధ్యపూరితమైన ఈ అనుభూతులకు కారణం ఏమిటి? 
 
ఒక ప్రదేశంలో వీచే గాలి, వస్తున్న వాసనలు, ధ్వనులు, నీరు, మొక్కలు, పూలు వంటివన్నీ ఆ తేడాను తీసుకురావటమే ఇందుకు కారణం. ఒక పవిత్ర భావాన్ని లేదా మంచి వాతావరణాన్ని ఒక ప్రదేశానికి కల్పించగలగటం మన చేతుల్లోనే ఉంది. ఇంటిలో సువాసనలు మనమే సృష్టించగలం, మొక్కలు, పూల చెట్లు మనం అమర్చుకోగలం. 
 
ఇంటిలో మార్పులు, చేర్పులు చేయడం వంటి అంశాల్లో ఫెంగ్ షుయ్ శాస్త్ర పద్ధతిని పాటిస్తే అన్నీ అనుకూలంగా జరుగుతాయి. మన ఇల్లు సుఖశాంతులతో కళకళలాడాలంటే ఫెంగ్ షుయ్ శాస్త్ర పద్ధతిని పాటిస్తే చాలు... ఇప్పుడు మనం ఫెంగ్ షుయ్ శాస్త్రం ప్రకారం ఇంటిని తీర్చిదిద్దుకునే తీరును చూద్దామా...
 
ఇంటికున్న కిటికీలు, తలుపులు తీసి గాలి ధారాళంగా వీచేలా చేయాలి. రోజూ ఇంటిని శుభ్రంగా చిమ్మటమే గాక, తడిగుడ్డతో తుడుచుకోవాలి. తడి గుడ్డతో తుడవటం ద్వారా విద్యుదయస్కాంత తరంగాల ప్రభావం తొలగిపోతుంది. అలాగే ఇంటిలో దీపం వెలిగించి ఉంచితే ఆ వెలుగు పవిత్రతను తెస్తుంది. అగరుబత్తీలు వెలిగించి ఉంచాలి. 
 
నలుగురు కూర్చుని మాట్లాడుకునే చోట చిరుమువ్వలు వేలాడ దీయాలి. గాలికి కదులుతూ అవి చేసే శ్రావ్యమైన శబ్దాలు మన దృష్టిని మరలుస్తాయి. గదిలో మూలలో కొద్దిగా ఉప్పు చల్లి ఉంచి ఒక రోజు తర్వాత దానిని ఎత్తి వేయాలి. జడత్వ శక్తిని ఉప్పు లాగేస్తుంది. ఇంట్లో ఆకర్షణీయంగా కనిపించే పూల మొక్కలుండాలి. పూల మొక్కలు విడుదల చేసే శక్తి ప్రభావం ఇంటిమీద పడుతుంది. ఇల్లంతా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. 
 
ఇంటిలోపల నీరు నిలువ ఉంచితే అది వ్యతిరేక శక్తి కేంద్రమవుతుంది. అందుకే నీరు పడితే వెంటనే తుడిచెయ్యాలి. అలాగే ఇంటిలో మనం తీసుకువచ్చే మార్పులు బయటి వాతావరణంలో రుతువులు తెచ్చే మార్పులకు తగినట్లుండాలి. అనవసర పదార్థాలు, వస్తువులు తొలిగిస్తే ప్రకృతిలోని మూల శక్తులన్నీ ఇంటిలోకి ధారాళంగా ప్రవేశించి జీవితంలో ఏ అడ్డంకులూ లేకుండా ఉంటాయి. ఫెంగ్ షుయ్ శాస్త్ర బోధనలను పాటిస్తే ఇంటిలోపలి వాతావరణం స్వర్గధామమై అలలారుతుందనటంలో సందేహమే లేదు.