ఆదివారం, 19 ఏప్రియల్ 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By ivr
Last Modified: సోమవారం, 21 సెప్టెంబరు 2015 (17:31 IST)

డేంజర్ డెంగ్యూ ఢిల్లీని వణికిస్తోంది... ఇక్కడ కూడా తొంగిచూస్తోంది... ముందుజాగ్రత్తగా...

రకరకాల ఇన్‌షెక్షన్లకు అనువైన కాలం వానాకాలం అంటుంటారు. అప్పుడప్పుడూ పడే వానచినుకులు నీటి గుంటలనూ, దోమకాట్లనూ తీసుకొస్తాయ్. వాటితో పాటే పెరిగిన వైరస్, బాక్టీరియా జబ్బుల్ని తెచ్చిపెడతుంటాయి. వర్షాకాలం చినుకుల చల్లదనాన్ని ఆస్వాదించనీయకుండా భయపెడతూ మలేరియా.. డెంగ్యూ లాంటి వ్యాధులు పట్టుకునే అవకాశం ఎక్కువ. అలాగే, ఆస్తమా, బ్రాంకైటిస్, మధుమేహం ఉన్నవాళ్లు ఈ సీజన్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచన చేస్తున్నారు. 
 
చిన్నారులు, వయస్సు పైబడిన వాళ్లలో కూడా వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. ఓ పూట వర్షం పడగానే మరో పూట విపరీతమైన ఎండ... ఇలా పదేపదే ఉష్ణోగ్రతలు మారుతుంటాయి. ఇలాంటి ఉష్ణోగ్రతల తేడాలు వీరిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. నిజానికి ఈ జబ్బులకు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం జాగ్రత్తపడితే వాటి బారిన పడకుండా తప్పించుకోవచ్చు. 
 
తీవ్రమైన జ్వరం.. రాత్రిపూట తట్టుకోలేనంత చలి... ఒళ్లు నొప్పులు, తలనొప్పి లాంటి లక్షణాలు మూడు రోజులకు మించి కనిపిస్తున్నాయంటే అది మలేరియా కావచ్చని భావించొచ్చు. వెంటనే వైద్యుని సంప్రదించి రక్తపరీక్ష చేయించుకుని నిర్ధారణ చేసుకోవాలి. 
 
వైరస్ ఇన్‌ఫెక్షన్ వల్ల వచ్చే డెంగ్యూను తెచ్చేవి దోమలే. నిల్వ వున్న నీటిలో డెంగ్యూను వ్యాప్తి చెందించే దోమలు పెరుగుతాయి. కాబట్టి నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. కొందరు కొబ్బరి బొండాలు, కొబ్బరి కాయలను కొట్టేసి ఆ చిప్పలను ఇంటి ప్రక్కనే వేసేస్తుంటారు. వర్షం పడగానే వాటిలో నీరు చేరుతుంది. అక్కడ ఈ డెంగ్యూ దోమలు తిష్ట వేస్తాయి. కాబట్టి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. సాధారణంగా రాత్రిపూటే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ దోమ తెరనో, మస్కిటో రిపెల్లెంట్స్ ద్వారానో వాటి నుంచి తప్పించుకోవచ్చు. డెంగ్యూ వ్యాధి గురించి మరికొంత అవగాహనకు ఈ క్రింది పటాన్ని చూడండి.
 
 
కలుషిత నీరు, ఆహారం కలిగించే మరో ముఖ్యమైన సమస్య టైఫాయిడ్. కలుషిత నీరు, ఆహారపదార్థాలపై మూతలు పెట్టకపోవడం దీనికి ప్రధాన కారణాలు. సాల్మొనెల్లా టైఫి అనే బాక్టీరియా టైఫాయిడ్‌ని కలిగిస్తుంది. తీవ్రస్థాయి జ్వరం, ఒంటినొప్పులు, తలనొప్పి, కొందరిలో వాంతులు ఉంటాయి. 
 
అలాగే, నిమ్మజాతి పండ్లను ఆరగించడం వల్ల జలుబు, తుమ్ములు వస్తుంటాయని అంటారు. నిజానికి వీటిలోని సి-విటమిన్ ఇమ్యూనిటీ పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఆస్తమా లాంటి అలర్జీలున్నవాళ్లు వీటిని తీసుకుంటే మాత్రం సమస్య పెరుగుతుంది. 
 
ఈ వర్షాకాలంలో వారానికి ఒక్కసారి మాత్రమే తలస్నానం చేయడం మంచిది. పండ్లను బాగా కడిగి ఆరగించాలి. నీటిని కాచి, చల్లార్చి మాత్రమే తాగాలి. సలాడ్స్ తీసుకోవడం మానివేయాలి. విరేచనాలను నిర్లక్ష్యం చేయవద్దు. 
 
మూడు రోజులు దాటినా జ్వరం, ఒంటినొప్పులు, జలుబు తగ్గకపోతే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను కలవాలి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించినట్టయితే, వర్షాకాలంలో ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా మనలను మనం కాపాడుకోవచ్చు.