శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: శనివారం, 20 ఫిబ్రవరి 2021 (14:33 IST)

కాలేయం చెడిపోతుంటే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

కాలేయం దేహాన్ని ఆరోగ్యం వుంచే అవయవాల్లో ప్రధానమైది. ఈ కాలేయానికి డ్యామేజ్ అవుతుందంటే ఆ లక్షణాలు మెల్లగా కనబడతాయి. కాలేయ వ్యాధి యొక్క సంకేతాలు మరియు లక్షణాలు సంభవిస్తే ఇలా ఉండవచ్చు.
 
చర్మం మరియు కళ్ళు పసుపు రంగులో కనిపిస్తాయి (కామెర్లు)
కడుపు నొప్పి మరియు వాపు.
కాళ్ళు మరియు చీలమండలాలో వాపు.
చర్మం దురద.
ముదురు రంగులో మూత్రం.
లేత రంగులో మలం.
దీర్ఘకాలిక అలసట.
వికారం లేదా వాంతులు.
 
లివర్ మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. తిన్న ఆహారం జీర్ణం అవ్వాలన్నా, శ‌రీరానికి శ‌క్తి స‌రిగ్గా అందాల‌న్నా, విష ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లాల‌న్నా లివర్ సరిగ్గా పని చేయాలి. కానీ నేటి త‌రుణంలో మ‌నం తింటున్న అనేక ఆహార ప‌దార్థాలు, ప‌లు వ్యాధులు, అల‌వాట్లు లివ‌ర్ చెడిపోవ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. లివర్ చెడిపోవడానికి గల కారణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చ‌క్కెర లేదా తీపి అధికంగా ఉన్న ఆహార ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తినడం వ‌ల్ల కాలేయం దెబ్బ తింటుంది. చ‌క్కెరను అతిగా తింటే అది మొత్తం లివ‌ర్‌లోనే పేరుకుపోయి కొవ్వుగా మారుతుంది. దీంతో కొంత కాలానికి లివ‌ర్ ప‌నితీరు మంద‌గించి చెడిపోతుంది. 
 
ఆహార ప‌దార్థాల‌ు రుచిగా ఉండటానికి వాటిలో మోనోసోడియం గ్లుట‌మేట్ అనే ప‌దార్థాన్ని ఎక్కువ‌గా క‌లుపుతున్నారు. ఈ ప‌దార్థం ఉన్న ఆహారాన్ని తింటే, దీని ప్రభావం లివ‌ర్‌పై పడి చెడిపోతుంది. కూల్‌ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల కూడా కాలేయం త్వరగా చెడిపోతుంది. కూల్‌‌డ్రింక్స్‌లో ఉండే రసాయన పదార్థాలు కాలేయాన్ని పని చేయకుండా చేస్తాయి. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాల శాతం పెరుగుతుంది. దాంతో కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి. 
 
ఉప్పు ఎక్కువ‌గా తిన‌డం వల్ల రక్తపోటు కూడా వస్తుందనే విషయం తెలిసిందే. చిప్స్‌‌లో ఉండే విష‌పూరిత‌మైన ప‌దార్థాలు లివ‌ర్ ఆరోగ్యంపై ప్ర‌భావం చూపుతాయి. కాబ‌ట్టి వాటికి కూడా దూరంగా ఉండ‌టం మంచిది. స్థూలకాయం ఉన్న‌వారు కూడా లివ‌ర్ ఆరోగ్యం ప‌ట్ల శ్రద్ధ వ‌హించాలి. శ‌రీరంలో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతే ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంది. 
 
డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారికి లివ‌ర్ వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం 50 శాతం వ‌ర‌కు ఉంటుంది. క్రిమి సంహారక మందుల‌ను వాడి పండించిన కూర‌గాయ‌లు, పండ్ల‌ను తింటే వాటితోపాటు ఆ మందులు కూడా మ‌న శ‌రీరంలోకి వెళ్తాయి. అప్పుడు ఆ మందులు లివ‌ర్‌పై ప్రభావం చూపుతాయి. మ‌ద్యపానం, ధూమపానం ఎక్కువగా చేసే వారిలో కూడా లివ‌ర్ త్వ‌ర‌గా చెడిపోతుంది. 
 
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే జాగ్రత్తలు
1. చిన్నచిన్న అనారోగ్య సమస్యలకే మందులను అతిగా తీసుకున్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు మందులను తక్కువగా, వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి.
 
2. సరైన నూనె వాడకుండా వండిన ఆహారం తిన్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాణ్యత కలిగిన నూనెను మాత్రమే వంటకాలకు ఉపయోగించాలి.
 
3. మద్యం సేవించడం కూడా లివర్ నాశనానికి కారణమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మద్యాన్ని పూర్తిగా మానేయడమే మంచిది.
 
4. ఆహారాన్ని సరిగా ఉడికించకుండా తింటే లివర్‌పై భారం పెరుగుతుంది. కాబట్టి పూర్తిగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తినాలి.
 
5. రాత్రి పూట త్వరగా పడుకొని... ఉదయాన త్వరగా నిద్రలేవాలి. ఇలా చేస్తే లివ‌ర్ డ్యామేజ్ కాకుండా చూసుకోవ‌చ్చు.
 
6. ఉదయం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తప్పనిసరిగా తీర్చుకోవాలి. లేదంటే లివర్‌లో వ్యర్థాలు పెరిగిపోతాయి. అంతేకాకుండా ఉదయం అల్పాహారం చేయడం అసలు మానేయకూడదు. లేదంటే లివర్ పైన ఒత్తిడి పెరుగుతుంది.
 
7. అతిగా ఆహారం తీసుకున్నా లివర్ డ్యామేజ్ అవుతుంది. ఆహారాన్ని జీర్ణం చేయడానికి లివర్‌కు ఎక్కువ సమయం పట్టడమే కాదు... అదనపు భారం కూడా పడుతుంది.