సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Modified: శుక్రవారం, 21 డిశెంబరు 2018 (17:07 IST)

కర్రీ పాయింట్ల నుంచి కూరలు... ఇవి చెక్ చేస్తున్నారా లేదా?

విద్య, ఉద్యోగాల కోసం ప్రస్తుతం పెద్దయెత్తున ప్రజలు పట్టణాలు, నగరాల్లో నివాసం ఏర్పరచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బ్యాచిలర్లుగా ఉండే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం, ఇంటిలో ఉండే ఇద్దరు లేదా ముగ్గురు ఉద్యోగాలు చేస్తుండటంతో, ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకునే కర్రీ పాయింట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దీనికయ్యే పెట్టుబడి కూడా చాలా తక్కువే, కాబట్టి చాలామంది ఈ వ్యాపారాన్ని చేయడానికే మొగ్గుచూపుతున్నారు.
 
ఈ వ్యాపారంలో క్రమంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా మారిపోవడంతో మిగిలిపోయిన ఆహారాన్ని రోజుల తరబడి ఫ్రిజ్‌లో పెట్టి, మళ్లీ వాటినే వేడి చేసి విక్రయిస్తున్నారు. వీటి కోసం వాడే సరుకులు, కూరగాయలు కూడా నాణ్యమైనవి వాడటంలేదు. ఆహారానికి మంచి రుచి తీసుకురావడానికి మసాలాలు, నూనెలు, కారం ఇతరత్రా వాటిని బాగా దట్టిస్తున్నారు.
 
ఇలాంటి కర్రీపాయింట్‌ల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు :
 
* మసాలాలు, కారం నూనెలు కలిగిన ఆహారాన్ని తినడం వల్ల జీర్ణకోశ వ్యాధులు, దీర్ఘకాలం బాధించే ఉదర, ప్రేగు క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉంది.
* షుగర్, బీపీ ఉన్న వారికి సమస్యలు తీవ్రంగా ఉంటాయి.
* కూరలు, మాంసాహారాన్ని రోజుల తరబడి నిల్వ చేయడం వల్ల అందులో సాల్మొనెల్లా అనే బాక్టీరియా వృద్ధి చెంది, దీని కారణంగా డయేరియా, ఇతర వ్యాధులు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.
* ఇలాంటి ఆహారంలో పరిశుభ్రమైన నీరు వాడకుండా, బోరు నీటినే వాడుతున్నారు, ఇందులో భార లోహాలు ఉండటం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
 
పాటించాల్సిన జాగ్రత్తలు :
* కర్రీ పాయింట్లలో పనిచేసే వ్యక్తులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, చేతులకు గ్లౌజులు, తలకు టోపీ ధరించాలి.
* పరిశుభ్రంగా లేని కర్రీ పాయింట్లలో కూరలు తీసుకోకపోవడమే మంచిది.
* తయారుచేసిన ఆహార పదార్థాలపై కీటకాలు వాలకుండా వాటిపై ఎప్పుడూ మూతపెట్టి ఉంచాలి.
* చాలా మంది నిర్వాహకులు వేడి వేడి కూరలను తక్కువ మైక్రాన్‌లు ఉన్న ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఇస్తున్నారు, దీని వల్ల ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి కూరలో కలిసిపోతుంది. కాబట్టి ఇంటి నుండే ఏవైనా బాక్స్‌లు తీసుకెళ్లడం మంచిది.