ప్రాణాలు తీస్తున్న సీజనల్ వ్యాధులు...
రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా మలేరియా, డెంగ్యూతోపాటు టైఫాయిడ్ విజృంభిస్తోంది. ఇప్పటికే డెంగ్యూతో పదుల సంఖ్యలో మృతి చెందారు. విశాఖ, గుంటూరు జిల్లాల్లో డెంగ్యూ ప్రభావం ఎక్కువగా ఉంది. విశాఖపట్నం కేజీహెచ్‌లో ఒకరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు డెంగ్యూతో మృతి చెందారు. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ డెంగ్యూ తీవ్రత ఎక్కువగా ఉంది.
సీజనల్ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ఆరోగ్య శాఖ వెనుకబడింది. డెంగ్యూ కేసులు నమోదయిన తర్వాతనే ఆరోగ్య శాఖ అధికారులు స్పందిస్తున్నారు. వ్యాధులు ప్రబలకుండా వర్షాకాలం ప్రారంభంలోనే గ్రామాల్లో ఫాగింగ్ చేయాలి. దోమలు పెరగకుండా స్ప్రేలు కొట్టాలి. కానీ ఆరోగ్య శాఖ ఈ చర్యలు తీసుకోవడం లేదు. డెంగ్యూ, మలేరియా కేసులు నమోదయిన తర్వాత హడావుడిగా ఆయా గ్రామాలకు వెళ్లి రోగులకు మందులు పంపిణీ చేస్తున్నారు.
ఆరోగ్యశాఖ నుంచి సరైన సలహాలు, సూచనలు లేకపోవడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. విజయవాడ రూరల్ మండలంలోని ప్రసాదంపాడు, రామవరప్పాడు, గుణదల ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ప్రజలు టైపాయిడ్, మలేరియా, డెంగ్యూ వ్యాధులతో బాధపడుతున్నారు. వీరంతా ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.