కాళ్ళూ, చేతులు అదేపనిగా కదపితే..
చాలా మంది అదేపనిగా కాళ్లూచేతులూ ఊపుతూ ఉంటారు. ఇలా ఊపడం తప్పని పెద్దవాళ్ళు వారిని మందలిస్తుంటారు. కానీ, ఇది చాలా మంచి అలవాటంటున్నారు నేటి పరిశోధకులు. ఈ అలవాటున్న వారిలో నాడీ సంబంధ వ్యాధులు దరిచేరవని వారు స్పష్టం చేస్తున్నారు.
గంటల తరబడి కుర్చిలో కూర్చునేవారు ఈ అలవాటు చేసుకుంటే మంచిదని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. ఇలా కాళ్ళూ, చేతులు అదేపనిగా కదపడం వల్ల ధమనుల్లో రక్తప్రసరణ మెరుగవుతుందనీ, తద్వారా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయన్న విషయం ఇటీవల వీరు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
ఇందుకోసం ఈ శాస్త్రవేత్తలు దాదాపు 50 మందిని ఎంచుకున్నారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపువారిని గంటకోసారి కాళ్ళూ, చేతులూ కదపమని చెప్పారు. మరొక గ్రూపుకు అలాంటి పనులు చెప్పలేదు. వారం రోజుల తర్వాత వారి ఆరోగ్యాన్ని పరిశీలించారు. కాళ్ళూ చేతులు ఆడించిన యువకుల గుండె ధమనుల్లో రక్తప్రసరణ మెరుగుకాగా, రెండో గ్రూపు వారిలో ఎలాంటి మార్పు కనపడలేదు. దీంతో ప్రతి ఒక్కరూ కాళ్లూ చేతులూ ఊపడం మంచిదని శాస్త్రవేత్తలు సూచన చేస్తున్నారు.