సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 మే 2020 (20:55 IST)

బార్లీ గడ్డితో జ్యూస్ తాగారా? (video)

Barley grass juice
బార్లీ గింజలతో జావ సరే.. కానీ బార్లీ గడ్డితో జ్యూస్ తాగడం విని వున్నారా? అవును.. బార్లీ గడ్డి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒత్తిడితో సతమతమవుతూ వుండేవారు బార్లీ గడ్డి జ్యూస్‌ను నిత్యం తాగుతుంటే ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. బార్లీ గడ్డిలో ఉండే న్యూరోట్రోఫిన్ అనబడే సమ్మేళనం ఒత్తిడి బారి నుంచి కాపాడుతుంది.
 
బార్లీ గడ్డిలో ఉండే ఫ్లేవనాయిడ్లు అనబడే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఉత్పన్నమయ్యే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీంతోపాటు రోజూ మనం తీసుకునే ఆహారం నుంచి శక్తి ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చూస్తాయి. అలాగే శరీర కణజాలాన్ని రక్షిస్తాయి. క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా చూస్తాయి.
 
బార్లీ గడ్డి జ్యూస్‌ను సేవించడం వల్ల షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. కిడ్నీ వ్యాధులు, కంటి చూపు సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే డయాబెటిస్ లేని వారిలో ఆ వ్యాధి రాకుండా ఉంటుంది. ఈ గడ్డి జ్యూస్‌ను తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అధికబరువును నియంత్రించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఈ గడ్డి జ్యూస్‌ను తీసుకోవడం ద్వారా అమైనో యాసిడ్లు, క్లోరోఫిల్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. వీటి వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. ఎముకలకు బలాన్నిస్తుంది. ఐరన్, కాపర్, ఫోలిక్ యాసిడ్, బి6, బీ12 వంటి ప్రోటీన్లు ఇందులో పుష్కలంగా వుండటం ద్వారా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 
 
ఇంకా చర్మానికి కూడా బార్లీ గడ్డి రసం మేలు చేస్తుంది. చర్మానికి కాంతిని ఇస్తుంది. బార్లీ గడ్డిని సలాడ్స్, స్మూతీస్‌లతో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయని ఆయుర్వేద నిపుణులు సెలవిస్తున్నారు.