బంగాళాదుంపలు అలా తింటే బరువు పెరుగుతారు, ఇలా తింటే అది తగ్గుతుంది
బంగాళాదుంప తినడం వల్ల పరిమితంగా, ఆరోగ్యకరమైన రీతిలో తీసుకుంటే మీకు కొవ్వు రాదు. కానీ బంగాళాదుంపలను ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ రూపంలో తీసుకుంటే లేదా డీప్ ఫ్రైడ్ చేస్తే, అది బరువు పెరగడానికి దారితీస్తుంది. అయితే, ఈ వీటికి రక్తపోటును తగ్గించే గుణముందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
రోజూ బంగాళదుంపలు తినడం వల్ల రక్తపోటు తగ్గుముఖం పట్టడంతో పాటు బరువు కూడా పెరగడం లేదని అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. తమ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు అధిక బరువు, రక్తపోటు గల 18 మందిని ఎంచుకుని వారికి రెండు రోజులకోసారి తొక్కతీయకుండా ఉడికించిన 6-8 ఆలుగడ్డలు చొప్పున ఆహారంగా ఇచ్చారు.
30 రోజుల తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. పరీక్ష ఫలితాలను విశ్లేషించి ఆలుగడ్డలను ఆహారంగా తీసుకున్న వారి సిస్టోలిక్ (రక్తపీడనంలో ఎగువ కొలత) 3.5 శాతం, డయాస్టోలిక్ (రక్తపీడనంలో దిగువ కొలత) 4.3 శాతం తగ్గిందని గుర్తించారు. దీంతో పాటు వారి బరువులో ఏవిధమైన మార్పులేదని పరిశోధకులు నిర్ధారించారు.