సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 3 జులై 2019 (18:48 IST)

వర్షాకాలంలో చేపలు అస్సలు తినకూడదా... ఎందుకని? (video)

మాంసాహారాల్లో చేపలు అన్నింటి కన్నా బెస్ట్ అని చెబుతారు. దీని వలన అనేక పోషకాలు అందుతాయి. కానీ వర్షాకాలంలో మాత్రం వీటి జోలికి వెళ్లడం అంత మంచిది కాదు. చేపల్లో ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఐతే వర్షాకాలంలో బలహీనంగా ఉండే మానవ జీర్ణవ్యవస్థపై ఇవి ఎక్కువ ప్రభావం చూపుతాయి. 
 
ఈ సీజన్‌లో చేపలతో పాటు ఇతర మాంసాహారం తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ అది మంచిది కాదు. శీతలీకరణ చేప మాంసం వర్షాకాలంలో తినకూడదు. పాడవకుండా ఉండేందుకు వాటిపై సల్ఫేట్స్, పాలి ఫాస్పేట్స్ పూస్తారు. కానీ 10 రోజుల తర్వాత అవి తొలగిపోతాయి. ఆ తర్వాత మాంసంపై బ్యాక్టీరియా, ఈస్ట్ పెరుగుతుంది. అలాంటి మాంసం తింటే రోగాలు వస్తాయి.
 
వర్షాకాలంలో చెరువులు, నదులు ఎక్కువగా కలుషితమవుతాయి. చేపలను బాగా కడిగినప్పటికీ, మలినాలు అంత సులభంగా తొలగిపోవు. వాటిని తింటే టైఫాయిడ్, జాండీస్, డయేరియా వచ్చే ప్రమాదముంది. వర్షాకాలంలో మీ జీర్ణశక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. 
 
భారీగా ఏదైనా తినడం వలన జీర్ణ వ్యవస్థపై భారం పడుతుంది. వర్షాకాలంలో అపరిశుభ్ర చేపలను తింటే శ్వాస, హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. అందుకే వర్షాకాలంలో మాంసాహారం ఎక్కువగా తింటే మంచిది కాదంటున్నారు వైద్యులు.