శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 26 డిశెంబరు 2019 (21:07 IST)

డైటింగ్ ఎంతవరకు అవసరం..?

చాలామంది నేను లావుగా ఉన్నాను. నన్ను ఎగతాళి చేస్తున్నారు. నేను ఇక నుంచి డైటింగ్ చేయాలి అంటుంటారు. అంటే తిండి తినడం తగ్గించడమన్నమాట. అయితే శరీరానికి సరిపడినంత ఆహారం తీసుకోవడం తప్పనసరి అంటున్నారు వైద్య నిపుణులు. అందంగా, సన్నగా, నాజూగ్గా ఉండాలనే ఉద్దేశంతో చాలామంది మహిళలు డైటింగ్ చేస్తుంటారు.
 
డైటింగ్ చేయడం వల్ల సన్నబడరు.. డైటింగ్ చేసేవారి శరీరంలో ఉండే మేలు చేసే కొలెస్ట్రాల్ గుండెను రక్షించే ప్రొటీన్లు తగ్గిపోతాయట. తత్ఫలితంగా గుండెకు ఒత్తిడి పెరిగి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. అందుకే కడుపుకు పట్టినంత తిని ఒంటికి చమట పట్టేంత పని చేయాలని అంటుంటారు మన పెద్ద వారు. 
 
డైటింగ్ చేయడం అనవసరమని హాయిగా అన్ని ఆహార పదార్థాలను తినమని వైద్యులు సలహాలిస్తున్నారు. శరీరానికి కావాల్సినంత వ్యాయామం ఉంటే ఏ విధమైన డైటింగ్ చేయకుండానే అందంగా నాజూగ్గా తయారవవచ్చు. ఇంటి పనంతా తమ చేతుల మీదుగా చేసుకునే స్త్రీలకి ఎటువంటి డైటింగ్ అవసరం లేదట. అలాంటి వారికి అనారోగ్యం దరిచేరవట. 
 
టీనేజ్ అమ్మాయిలు కడుపునిండా తినడానికి ఇబ్బంది పడుతుంటారు. అలా అయితే ఎనిమిక్‌గా తయారవడమే కాకుండా మొహంలో మెరుపు, కళ్ళలో కాంతి తగ్గిపోతాయట. శరీరానికి శక్తినిచ్చే క్యాలరీలను తీసుకోకుండా తగ్గించి తినడం వల్ల ఆరోగ్యానికి మంచి కాదని, కొవ్వు పదార్థాలు తీపి పదార్థాలు ఎక్కువగా తినకుండా ఉంటే మంచిదంటున్నారు. 
 
కొన్నిరోజులు డైటింగ్ పేరుతో కడుపు మాడ్చుకుని ఆ తరువాత మామూలుగా తినడం మొదలుపెడితే జీర్ణకోశానికి మంచిది కాదట. ఒళ్ళు రావడం అనేది ఆయా వ్యక్తుల శరీర తత్వాన్ని, హార్మోన్లను బట్టి ఉంటుందట. కానీ ఆహారం వల్ల కాదని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల అసలు డైటింగ్ చేయడం అంత అవసరం కాదంటున్నారు.