బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 26 డిశెంబరు 2018 (15:05 IST)

నవ్వుతో అనారోగ్యాలు మటుమాటయం..?

నవ్వు... నవ్వు, నవ్వు, నవ్వు అంటూ ప్రతి రోజు నవ్వుతుండటం నేర్చుకుంటే ఆరోగ్యంతోపాటు మనిషి నిత్య యవ్వనంగా ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. నవ్వుతో శరీరంలోని ఎలాంటి జబ్బునైనా మటుమాయం చేయవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. నవ్వే శక్తి కేవలం మానవునికి మాత్రమే సాధ్యమనడంలో సందేహం లేదు. 
 
మనిషిలోని స్వచ్ఛమైన నవ్వుకి, ముఖంలోని హావభావాలకి దగ్గరి సంబంధం ఉన్నట్లే శరీరంలో జరిగే పలు రసాయన మార్పులకు కూడా సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు. శరీరంలో ఎంజైములు, హార్మోనులు విడుదల కావడానికి ఆరోగ్యవంతమైన నవ్వు దోహదపడుతుంది. ఎంజైములు, హార్మోన్లు శరీర అవయవాల పనితనాన్ని మెరుగు పరుస్తాయని పరిశోధకులు తెలిపారు.
 
నవ్వు ఒక భోగం... నవ్వించడం యోగం... నవ్వలేకపోవడం రోగం అన్నారు.. నవ్వు గురించి తెలిసిన మహానుభావులు.. నవ్వు ఓ మనిషి తనకు తాను తయారుచేసుకునే అద్భుత సౌందర్య సాదనం. నవ్వుకు మరే ఇతర సౌందర్య సాదనమూ సాటి రాలేదు. నవ్వు ఆరోగ్యంపై అద్భుతమైన ప్రభావం చూపుతుంది.
 
ప్రపంచంలోని మిగిలిన ప్రాణులకు నవ్వడం, ఏడ్వడం తెలియదు. కాని వాటి భావాలను మాత్రం వ్యక్తపరుస్తుంటాయి. మనిషి అలా కాదు. అతనికి ఏడుపు వచ్చినా, నవ్వు వచ్చినా వెంటనే ముఖకవళికలలో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ రోజుకు కనీసం పావు గంటైనా హాయిగా నవ్వుకోవాలి. లాఫ్ అండ్ లాఫ్.. అన్‌టిల్ యు గెట్ కాఫ్‌ అని ఓ సూక్తి ఉంది. దగ్గొచ్చే దాకా పగలబడి నవ్వండి అని దీని అర్థం.  
 
మనిషి శరీరంలోని రక్తప్రసరణను క్రమబద్ధీకరించే శక్తి నవ్వుకు మాత్రమే ఉంది. ప్రాణవాయువు, న్యూట్రిషన్స్‌ శరీరానికి ఎంత అవసరమో, నవ్వుకూడా అంతే అవసరమంటున్నారు ఆరోగ్య నిపుణులు. బిగ్గరగా నవ్వడం వలన ఉదరం, కాళ్లు చేతులు, ముఖ కండరాలు అన్నింటికీ వ్యాయామం చేసిన ఫలితం దక్కుతుంది. 
 
అధిక రక్తపోటుతో బాధపడేవారు రక్తపోటును క్రమబద్దీకరించుకునేందుకు మందులతో పనిలేకుండా ప్రతి రోజు కాసేపన్నా మనసారా నవ్వుతుంటే రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటుందని పరిశోధకులు సూచించారు. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. 
 
శరీరానికి అందించే ఆహారం ద్వారా తీసుకున్న క్యాలరీలు ఖర్చు కావాలంటే నవ్వు తప్పనిసరి. అంటే నవ్వు ద్వారా బరువు తేలికగా తగ్గవచ్చు. ఇవి శారీరకమైన లాభాలు. అలాగే నవ్వు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు మానసిక బలాన్ని కూడా అందిస్తుందనడంలో సందేహం లేదంటున్నారు పరిశోధకులు.