ఒకవైపు వేసవి, ఇంకోవైపు కరోనా, ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
ఒకవైపు కరోనా వైరస్ కల్లోలం, ఇంకోవైపు మండే ఎండలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో జాగ్రత్తగా వుండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇదివరకు మార్కెట్లో ఏది దొరికితే అది కొనుక్కుని తినేసేవాళ్లం కానీ ఇప్పుడలా కాదు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవటం ఉత్తమం.
వేసవి కనుక శరీరానికి చల్లదనం ఇచ్చే అన్నిరకాల పండ్లను సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవాలి. ఐస్ తక్కువగా వేసుకుని పండ్ల రసాలను కూడా ఎక్కువగా సేవించవచ్చు. సహజసిద్ధమైన పోషక విలువలు ఉండే పండ్లను తిన్నట్లయితే శరీరాన్ని సమస్థితిలో ఉంచటమేగాక దాహార్తిని తీర్చి శరీరానికి స్వాంతననిస్తాయి.
పండ్లలో పుచ్చకాయను తినటంవల్ల శరీరానికి ఎంతగానో మేలు జరుగుతుంది. రుచితోపాటు బి విటమిన్ అధికంగా ఉండే పుచ్చకాయ శరీరానికి శక్తినివ్వటమేగాక.. అందులో ఉండే పొటాషియం గుండెకు ఎంతగానో మేలు చేస్తుంది. వడదెబ్బ బారినుంచి కాపాడుతుంది. రక్తపోటును అరికడుతుంది. అలాగే పోషక విలువలు ఎక్కువగా ఉండే కీరదోసను కూడా ఎక్కువగా తీసుకోవాలి.
కొబ్బరి నీళ్లను కూడా వేసవిలో ఎక్కువగా తాగాలి. ఇందులోని ఖనిజ లవణాలు వేసవి నుంచి శరీరాన్ని చల్లబరుస్తాయి. దీంతో పాటు శరీరాన్ని తక్షణ శక్తి అందిస్తుంది. వేసవి తాపం నుంచి శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సాధ్యమైనంత ఎక్కువగా మంచినీటిని తాగాలి.
అలాగే చెరకు రసాన్ని కూడా తీసుకోవాలి. ఈ రసంలో కార్బోహైడ్రేట్లు అపారంగా ఉంటాయి. దీంతో తక్షణ ఉపశమనం లభిస్తుంది. మూత్ర సంబంధ వ్యాధులతో బాధపడేవారు చెరకు రసం తీసుకుంటే చాలా మంచిది. వేసవిలో ఎప్పటికప్పుడు మజ్జిగలో నిమ్మరసం కలుపుకుని తాగితే చాలా మంచిది.