మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2019 (15:08 IST)

వడదెబ్బతో జాగ్రత్త.. ఒకవేళ తగిలితే ఏం చేయాలంటే?

వడదెబ్బ, దీనినే ఎండదెబ్బ అని కూడా అంటారు. ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైన కారణంగా శరీరంలోని వేడిని నియంత్రించే వ్యవస్థ విఫలమయి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. చాలా వేడైన వాతావరణం లేదా చురుకైన పనుల వలన కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది.


అధిక ఉష్ణోగ్రతలు, శరీరంలోని ప్రాథమిక అవయవాలు విఫలమయ్యేలా చేస్తాయి. వేడికి సంబంధించిన సమస్యలలో వడదెబ్బ చాలా తీవ్రమైనది. ఇది తరచుగా వేడి వాతావరణంలో, సరైన మోతాదులో ద్రవపదార్థాలని తీసుకోకుండా బరువైన పనిని చేసినప్పుడు కలుగుతుంది.
 
ఈ వడదెబ్బ ఎవరికైనా వచ్చేది అయినప్పటికీ, కొంతమంది మాత్రమే దీని బారిన పడుతుంటారు. వారిలో పిల్లలు, క్రీడాకారులు, అతిమూత్ర వ్యాధి ఉన్న వ్యక్తులు, మద్యం సేవించేవారు, విపరీతమైన సూర్యరశ్మిని వేడిని తట్టుకోలేనివారు ఉన్నారు. కొన్ని మందులు కూడా మనిషిని వడదెబ్బకు గురిచేస్తాయి. 
 
వడదెబ్బకు లోనైనప్పుడు శరీరంలో కనిపించే లక్షణాల గురించి దాని నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె/నాడి కొట్టుకోవడం, వేగంగా/తక్కువగా శ్వాస తీసుకోవడం, ఎక్కువ లేదా తక్కువ రక్తపోటు, చెమట పట్టక పోవడం, చిరాకు, కంగారు లేదా అపస్మారక స్థితి, తలతిరగడం లేదా తేలిపోవడం, తలపోటు, వికారం (వాంతులు) వంటివి కనిపిస్తాయి. 
 
ఇది ముదిరితే, స్పృహకోల్పోవడం, మానసిక కలత, చేతులు కాళ్లు లాగేయడం, అకస్మాత్తుగా వ్యాధులు రావడం జరుగుతుంది. వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లబరచాలి. వీలుంటే చల్లటి నీటిలో మునగనివ్వాలి. తడిబట్టలతో చుట్టాలి. 
 
చల్లని నీటిలో తడిపిన బట్టతో ఒళ్లంతా అద్దాలి. రోగి ఉష్ణోగ్రత 101ºF వరకూ తగ్గితే, చలువగా ఉండే గదిలో సౌకర్యంగా పడుకోబెట్టాలి. మళ్లీ ఉష్ణోగ్రత పెరిగితే పై విధానాన్ని తిరిగి అనుసరించాలి. ఎటువంటి మందులు ఇవ్వకూడదు. కొబ్బరి నీళ్లు, ఎనర్జీ డ్రింక్స్ తాగించాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.