సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (09:51 IST)

బరువు తగ్గేందుకు వాకింగ్ చేస్తున్నారా?

చాలా మంది బరువు తగ్గేందుకు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేస్తుంటారు. ఇలాంటి వారికి అమెరికాలోని బ్రిగ్‌హామ్ యంగ్ విశ్వవిద్యాలయ అధికారులు షాకింగ్ న్యూస్ వెల్లడించారు. ప్రతి రోజూ వాకింగ్ చేయడం వల్ల బరువు పెరుగుదలకు అడ్డుకట్ట పడుతుందనే భావన సరికాదన్నారు. 
 
ఇందుకోసం ఈ వర్శిటీకి చెందిన 120 మంది యువకులపై ఓ అధ్యయనం జరిపారు. ఇందులో ఈ విషయం వెల్లడైంది. ముఖ్యంగా, యువకులంతా పెడోమీటర్లు తప్పనిసరిగా ధరించాలనే నిబంధన విధించారు. వాటి ద్వారా వారు రోజూ ఎన్ని అడుగులు నడుస్తున్నారనే వివరాలను సేకరించారు. 
 
24 వారాల తర్వాత వారివారి నడకలకు సంబంధించిన గణాంకాలను.. శరీర బరువుల్లో వచ్చిన తేడాలను పోల్చి చూశారు. అత్యధికంగా రోజూ 15 వేల అడుగులు నడిచిన వారి బరువు కూడా సగటున 1.5 కేజీలు పెరిగినట్లు గుర్తించారు. 
 
దీన్నిబట్టి శరీర బరువు నియంత్రణకు నడక ఒక్కటే సరిపోదని.. ఆహారపు అలవాట్లు, జీవనశైలి వంటి పలు ఇతరత్రా అంశాలు కూడా కీలకమైనవేననే నిర్ధారణకు వచ్చారు.