సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : సోమవారం, 5 నవంబరు 2018 (09:56 IST)

రాత్రిపూట ఉపవాసం ఉంటే...

చాలా మంది ఉదయం లేదా పగటి పూట ఉపవాసం ఉంటారు. రాత్రి కడుపునిండా ఆరగించి నిద్రకు ఉపక్రమిస్తుంటారు. నిజానికి పగటి పూటకంటే రాత్రి పూట ఉపవాసం ఉంటే మంచిదని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. 
 
నిజానికి రాత్రిపూట భోజనం చేయకుండా నిద్రకు ఉపక్రమిస్తే, మధ్య రాత్రిలో ఆకలేస్తుంది. ఒకసారి మేలుకొంటే, మళ్లీ నిద్రపట్టదన్నది చాలా మంది అభిప్రాయం. కానీ, ఇది తప్పని న్యూయార్క్ పరిశోధకులు తమ అధ్యయనంలో తేల్చారు. రాత్రి పూట చేసే ఉపవాసంతో మంచి నిద్ర వస్తుందని, ఏకాగ్రత, చురుకుదనం పెరుగుతాయని వారు గుర్తించారు. 
 
నిద్రపోతున్నప్పుడు పెద్ద వారిలో దాదాపు 500 కేలరీలు ఖర్చవుతాయని అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. ఇందులోభాగంగా 21 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న 44 మందిని పరిశీలించినట్టు వివరించారు. కొంత కాలం కడుపునిండా ఆహారం, పానీయాలు ఇచ్చారు. ఆపై మరికొన్ని రోజులు ఎటువంటి ఆహారం ఇవ్వకుండా నీరు మాత్రమే ఇచ్చారు. 
 
వీరు ఎలా నిద్రపోతున్నారన్న విషయాన్ని పరిశీలించి అధ్యయనాన్ని రూపొందించారు. కడుపునిండా తిన్నప్పటితో పోలిస్తే, ఆహారం తీసుకోనప్పుడే బాగా నిద్ర పట్టినట్టు ఈ అధ్యయనంలో తేలింది. రాత్రి సమయాల్లో మితాహారమే మేలని, ఎక్కువగా తినడం వల్ల నిద్రలేమితో పాటు ఇతరత్రా సమస్యలు కూడా ఏర్పడతాయని తెలియజేశారు.