తలస్నానం చేసేటపుడు ఈ తప్పులు చేస్తున్నారా?
చాలామంది యువతీయువకులు ప్రతి రోజూ తలస్నానం చేస్తారు. మరికొందరు వారానికి రెండుసార్లు లేదా వారానికి ఒకసారి తలస్నానం చేస్తుంటారు. అయితే, తలస్నానం చేసేటపుడు యువతీయువకులు లేదా ఆడామగా ఎవరైనా కావొచ్చు... అనేక తప్పులు లేదా పొరపాట్లు చేస్తుంటారు. అవేంటో ఓసారిపరిశీలిద్ధాం.
* చాలా మంది తలస్నానం చేసేసమయంలో షాంపును ఎక్కువగా వేసుకుంటారు. అలా చేస్తే మురికి పోతుందన్నది వారి భావన. నిజానికి షాంపును ఎక్కువగా వేసుకోవడం వల్ల మురికిపోదు కదా... తలపై నురగ ఎక్కువగా వస్తుందేగానీ పెద్దగా ప్రయోజనం ఉండదు. అందువల్ల తక్కువ షాంపు వేసుకుని తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
* ఎక్కువ మంది తలస్నానం వేడినీళ్ళతో చేస్తుంటారు. ఇది సరికాదు. వేడినీళ్ళతో తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు వేగంగా డ్రై అయిపోతాయి. అందువల్ల వేడి నీళ్లకు, చల్లటి నీటికి బదులు.. గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. దీనివల్ల తలస్నానం కోసం ఉపయోగించే షాంపు లేదా కండిషనర్లు వెంట్రుకలపై మంచి ప్రభావం చూపుతాయి.
* అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తలస్నానం చేసేముందు వెంట్రుకలను నీటితో బాగా కడుక్కోవాలి. షాంపును తలకు రాసుకోబోయే ముందు కనీసం ఒకటి రెండు నిమిషాల పాటు జట్టును షవర్ కింద ఉంచాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు బాగా తడుస్తాయి. దీంతో షాంపు, కండిషనర్లు జుట్టుపై బాగా పనిచేస్తాయి.
* అలాగే, తలస్నానం తూతూమంత్రంగా వేగంగా చేయకూడదు. వెంట్రుకలకు రాసుకున్న షాపు లేదా కండిషనర్లు పోయేంతవరకు నీటితో శుభ్రం చేయాలి. ఇలాంటి చిన్నపాటి చిట్కాలు పాటిస్తే వెంట్రుకల సంరక్షణకు ఎంతో ఉపయోగరకంగా ఉంటుంది.