1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By Selvi
Last Updated : గురువారం, 7 ఆగస్టు 2014 (16:43 IST)

వరలక్ష్మి వ్రతం: తోరం ఎలా చేయాలి.. నైవేద్యం గురించి?

తెల్లటి కొత్త దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. అయిదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. మధ్యలో పసుపు కొమ్ము కట్టాలి. వీటిని కలశం ముందు ఉంచి పూజించాక, చేతికి కట్టుకున్న తర్వాతే వ్రతం ప్రారంభించాలి. తోరం కట్టుకోవడమంటే నిష్టతో, మనసు లగ్నం చేసి పూజకు సిద్ధం కావడమే.
 
పూజా సామాగ్రి
కలశం, పసుపు, కుంకుమ, వాయనానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవిక వస్త్రం, గంధం, పూలు, పండ్లు, తమలపాకులు, వక్కలు, తోరాలకు దారం, టెంకాయ, అరటి పండ్లు, పత్తితో చేసిన వత్తులు, ప్రమిదలు, నూనె లేదా నెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు, పసుపు కొమ్ములు, మహానైవేద్యానికి ప్రసాదాలు. 
 
అమ్మవారికి ఆరగింపు..
‘వరాల తల్లి’ని ప్రసన్నం చేసుకునేందుకు వ్రతం సందర్భంగా మహానైవేద్యం సమర్పించాలి. అమ్మవారికి పలు రకాల పిండివంటలను శుచి, శుభ్రతతో ఇంట్లోనే తయారు చేసుకుని, సంప్రదాయబద్ధంగా నివేదించాలి. పులిహోర, గారెలు, పాయసం, క్షీరాన్నం, బొబ్బట్లు, కొబ్బరి అన్నం, గుమ్మడి బూరెలు, కొబ్బరి బూరెలు వంటివి ఆరగింపు సేవలో ఉంచాలి.