విశాఖకు ఆధ్యాత్మిక మణిహారం...రూ.100 కోట్లతో ఇస్కాన్ దేవాలయం
విశాఖ నగరం అదనపు సోగసులు తెచ్చుకుంటోంది. పర్యాటకంగా అనేక ప్రాజక్టులు అక్కడికి వస్తున్నాయి. అదే సమయంలో ఆధ్యాత్మిక శోభను కూడా సంతరించుకోబోతోంది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం రూ.100 కోట్లతో నగరంలో సాగర తీరాన అద్భుత ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, పలు విశిష్టతలతో రూపుదిద్దుకుంటున్న ఈ ఆలయం మూడేళ్లలో అందుబాటులోకి రానుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆలయం రూపుదిద్దుకోనుంది.
విశాఖలో ఇస్కాన్ దేవాలయాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన 1999లోనే అంకురించింది. సుదీర్ఘ ప్రక్రియల అనంతరం ప్రభుత్వం 2005లో రెండెకరాల స్థలం కేటాయించింది. అయితే తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనల కారణంగా గత పదేళ్లుగా నిర్మాణం ముందుకు సాగలేదు. ఈ నిబంధనలపై ఇస్కాన్ ప్రతినిధులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో జరిపిన మంతనాలు ఫలించాయి. అన్ని అనుమతులు లభించడంతో ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది.
2018 కల్లా ఆలయాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఇస్కాన్ ప్రతినిధులు పనులు ప్రారంభించారు.దేశంలోని ఏ ఇస్కాన్ దేవాలయానికి లేని విధంగా విశాఖలో దేవాలయం పై అంతస్తులో రాధాకృష్ణులు ఇతర దేవతల్ని దర్శించుకుని.. భక్తులు బయటకు వచ్చేటప్పుడు సుందరసాగరతీరం కనువిందు చేస్తుంది. ఆలయంలో రాధాకృష్ణులతో పాటు జగన్నాథ-బలదేవ-సుభద్ర ఆలయం, సీత-రామ-లక్ష్మణ-హనుమ ఆలయం, బాలాజీ, నరసింహస్వామి మందిరాలను నిర్మిస్తున్నారు. ఆలయం లోపల మొత్తం పాలరాతితో నిర్మాణం చేపడతారు. చెన్నైకి చెందిన స్థపతి పర్యవేక్షణలో నిర్మాణం కొనసాగుతోంది. ఇక్కడ ఆలయంలో అనే రకాల ప్రదర్శనలు చేపడతారు. ఇటు ఆధ్యాత్మికత, అటు పర్యాటకాన్ని మేళవింపచేసి ఆలయాన్ని నిర్మించనున్నారు.