హోలీ ఎలా వచ్చిందో తెలుసా?
రాక్షసరాజైన హిరణ్యకశ్యపుని కుమారుడు ప్రహ్లాదుడు. నిత్యం విష్ణు నామస్మరణతో వున్న ప్రహ్లాదునిపై కోపం పెంచుకున్నాడు హిరణ్యకశిపుడు. తన సోదరి హోలికను పిలిచి ప్రహ్లాదుడిని తీసుకొని అగ్నిప్రవేశం చేయమన్నాడు. హోలికకు లభించిన వరం ప్రకారం, అగ్ని ఆమెకి ఏమీ చేయదు. అన్న ఇచ్చిన ఆదేశంతో హోలిక ప్రహ్లాదుడిని ఎత్తుకొని అగ్నిగుండంలోకి వెళ్తుంది.
ఎప్పుడూ విష్ణు నామస్మరణలో ఉండే ప్రహ్లాదుడిని మంటలు తాకకుండా ఆ పరమాత్ముడు అనుగ్రహిస్తారు. వెంటనే ప్రహ్లాదుడు ఆ మంటల నుంచి బయటకు వచ్చాడు. హోలిక మంటలకు ఆహుతై ప్రాణాలు విడిచింది. హోలికకు వరముంది కదా.. అగ్నికి ఆహుతైందేమిటీ అని మీకు అనుమానం రావచ్చు. అయితే హోలిక ఒంటరిగా అగ్ని ప్రవేశం చేసినప్పుడు మాత్రమే ఆ వరం సిద్ధిస్తుంది. బాలకుడైన ప్రహ్లాదుడిని కూడా తీసుకొని మంటల్లో ప్రవేశించడంతో ఆ వరం ఫలించలేదు.
హోలిక చనిపోయిన రోజును పురస్కరించుకొని హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను కృష్ణుడు పెరిగిన ప్రాంతాలైన మథుర, బృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. హోలీ సందర్భంగా కామదహనం కూడా నిర్వహిస్తారు.
ఈ పండుగ రోజున, తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా ప్రకాశిస్తాయి. అక్కడ వివిధ రకాల రంగుల ఉత్పత్తి అయ్యి వృద్ధిపొంది , వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదే ఈ పండుగ విశేషం. పురాణ కథలతో పాటుగా హోళీ పండుగ వెనుక మరో పరమార్థం ఉంది. హోళీ పండుగను వసంత ఋతువు ఆగమనంగా పౌర్ణమి రోజున జరుపుకుంటారు.
ఇది చలికాలం తొలగిపోయి ఎండాకాలం ఆరంభానికి నాంది ప్రస్థావన వంటిది. హోళీ పండుగను సాధారణంగా ఫాల్గుణి పూర్ణిమ నాడు జరుపుకుంటారు. ఇలా ఒక ఋతువు వెళ్ళి మరో ఋతువు వచ్చే సమయంలో ముఖ్యంగా శీతాకాలం చలి వెళ్ళిపోయి ఎండాకాలం వేడి వచ్చే సమయంలో ఉష్ణోగ్రతల తేడావల్ల చర్మం చిట్లుతుంది. ఈ రంగులు ఆ చిట్లటం వల్ల కలిగే చికాకును తగ్గిస్తాయి.
హోలీ పుట్టుక వివరాల గురించి వేరొక కథ ఉంది. ఈ కథ ప్రేమ దేవుడైన కామదేవుడు గురించి తెలుపుతుంది. పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగపరచడానికి అతనిపై పూల బాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు నాశనం చేసాడు. తరువాత శివుడు, తన త్రినేత్రాన్ని తెరిచి, కామదేవుని శరీరాన్ని బూడిద చేశాడు. కామదేవుని భార్య రతి కోరికమేరకు శివుడు కామదేవుడిని మళ్ళీ బ్రతికిస్తాడు కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేక పూరితప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకొంటారు.