శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By డీవీ
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (20:11 IST)

పిండ ప్ర‌దానాలు - సైన్స్ ప‌రంగా హాలీవుడ్ సినిమాగా ఎలా తీస్తున్నారో తెలుసా!

Interstellar
సైన్స్ : తద్దినం ఎందుకు ?  మహాభారతంలో ఒక కధ ఉంది. కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు.  అతనికి రేవతి అనే అందమైన కూతురు ఉండేది. అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంటపెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు.
 
ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమిపై 27 చతుర్యుగాలు గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు.
 
Taddinam
దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ.. ఇప్పుడు భూమిపై 28వ చతుర్యుగము నడుస్తుంది. అక్కడ మహా విష్ణు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ...
 
ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం...
ఆ చిత్రం పేరు ఇంటర్స్టెల్లార్  "Interstellar" ఈ చిత్రం 2014 లో వచ్చింది. ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రంలో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు, కొడుకు ఉంటారు. కూతురంటే అతనికి ప్రాణం. 
 
ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు.

తన కూతురు గదిలో దూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ దూళి చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో.  అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవి శని గ్రహానికి(Saturn) దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని (Galaxy) ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్.
 
అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి ‘వార్మ్ హోల్’ (Warm hole) ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా.  వార్మ్ హోల్ అంటే ఒక గాలక్సీ నుండి ఇంకో గాలక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి. అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని, వగైరా వగైరా(etc etc..).. అప్పటికి ఆ హీరో కూతురు వయ్యస్సు 10 సంవత్సరాలు (ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి). ఆ తరువాత కధ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి (Black hole) ప్రవేశిస్తాడు. అయితే అది 4D లోకం. మనం ఉన్నది 3D ప్రపంచం.  నాలుగవ డైమెన్షన్ కాలం.
 
అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట.
అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించ గలడన్న మాట.  అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు. అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు.
 
ఇప్పుడు అర్ధం అయ్యిందా, అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే. ఇక ఆ తరువాత కొంత కధ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు. అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది. కాని హీరో వయసు మాత్రం మారదు. ఎందుకంటే హీరో వెళ్లిన గ్రహంలో ఒక గంట భూమిపై ఏడు సంవత్సరాలతో  సమానం.
 
పైన మహా భారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కధగానే తీసుకుంటాం. కాని ఆ కధలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే  "సమయ విస్ఫారణం"(Time dilation), "కృష్ణ బిలం (Black hole), "వెచ్చని రంధ్రం” (Warm hole) వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మము యందు చెప్పడం జరిగింది.
 
అందుకే స్వామీ వివేకానంద అన్నారు.. "సైన్స్ అభివృద్ధి అయ్యేకొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది" అని.
 
ఇతర లోకాలకు, మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే "సమయ విస్ఫారణం” (Time dilation) అని నేటి సైన్స్ చెబుతుంది. మనం మహాభారతంలో చదువుకున్నాం. పాండవులు చివరి రోజులలో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాలు మీదుగా ప్రయాణం చేయడం. కాని, స్వర్గం ఉండేది భూమిపై కాదు. మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్లడం ఏంటి అని అనుమానం వస్తుంది. నాక్కుడా వచ్చింది.
 
పైన చెప్పిన వార్మ్ హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి. హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వార్మ్ హోల్స్ ఉన్నాయన్న మాట. అలాగే ఆదిశంకరాచార్యుల వారు బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది. అంటే అక్కడ వార్మ్ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్ధం అవుతుంది.
 
మన హిందూ సనాతన ధర్మము ప్రకారం, గరుడ పురాణం బట్టి చూసినా చనిపోయిన వారికి 11 -15 రోజుల వరకూ ప్రతీరోజూ పిండ ప్రధానం చేస్తారు. ఆ తరువాత సంవత్సరం వరకూ నెలకొక్కసారి చేస్తుంటారు. ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు.
 
ఎందుకో తెలుసా, చనిపోయిన 11- 15 రోజుల వరకూ జీవుడు భూమిపైనే ఉంటాడు. అందుకే ప్రతీరోజు పిండ ప్రధానం చేస్తాం. ఆ తరువాత జీవుడు స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది గరుడ పురాణం ప్రకారం. ఆ సమయంలో భూమిపై నెలరోజుల కాలం ఆ లోకంలోని వారికి ఒకరోజుతో సమానం. అందుకే నెలకొకసారి చేస్తే వారికి రోజుకొకసారి పెట్టినట్టు. ఇక సంవత్సరం తరువాత స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకుంటారు. అప్పుడు సంవత్సరానికి ఒకసారే పెడతాం.
 
ఎందుకంటే అక్కడ ఒక రోజు, భూమిపై ఒక సంవత్సరంతో సమానం. ఇలానే ఎన్నో లోకాలు, ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి. ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే "సమయ విస్ఫారణం"(Time Dilation) అంటాం.
 
ఇట్లానే.. బ్రహ్మ దేవుడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినపుడు కూడా ఒక క్షణం పాటు అది ఒక సంవత్సరం అయ్యింది. అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా, జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్తాడు.
 
ఇలా మన పురాణాలలో ఎన్ని విషయాలు ఉన్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం, మన సంస్కృతిని కాదని ఏ తల తోక లేని మాయలో పడుతున్నారు. మన తరువాత ఎప్పుడో వచ్చినవి ఇలాంటి విజ్ఞానంలో మన హిందూ సనాతన ధర్మమునకు దరిదాపుల్లో కూడా రాలేవు.