శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 8 సెప్టెంబరు 2021 (21:04 IST)

అస్సాంలో ఘోర ప్రమాదం: పడవలు ఢీకొని 100 మంది గల్లంతు

అస్సాంలోని జోర్హాట్ లోని బ్రహ్మపుత్ర నదిలో రెండు ప్రయాణీకుల పడవలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఒక మహిళ మరణించింది. దాదాపు 100 మంది గల్లంతైనట్లు సమాచారం. 
ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో గౌహతికి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోర్హాట్ లోని నిమాటి ఘాట్ వద్ద దాదాపు 200 మంది ప్రయాణికులు పడవల్లో ప్రయాణిస్తుండగా రెండూ ఢీకొట్టుకున్నాయి.
 
లోతట్టు జల రవాణా శాఖకు చెందిన ఒక పడవ, అస్సాంలోని నది ద్వీపం మజులీ నుండి నిమాటి ఘాట్‌కు 120 మంది ప్రయాణికులతో వస్తుండగా, మరొక పడవ ఎదురుగా వెళుతోంది. రెండు పడవలు ఢీకొట్టుకోవడంతో పడవలు బోల్తా పడ్డాయి. కొంతమంది ప్రయాణికులు పడవలోనే వుండి ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నించగా, మరికొందరు తమను తాము రక్షించుకోవడానికి నీటిలో దూకారు. పడవల్లో ఉన్న మోటార్‌బైక్‌లు, కార్లతో పాటు ప్రయాణికుల లగేజీ కూడా నదిలో కొట్టుకుపోయింది.
 
రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకు ఒక శిశువుతో సహా దాదాపు 42 మందిని రక్షించారు. రక్షించబడిన, చికిత్స కోసం ఆసుపత్రికి పంపిన ఒక మహిళ మరణించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
 
ప్రమాదం జరిగిన తర్వాత లోతట్టు జల రవాణా శాఖలోని ముగ్గురు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సంఘటన జరిగిన వెంటనే, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మజులి మరియు జోర్హాట్ జిల్లాల జిల్లా యంత్రాంగాన్ని ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ సహాయంతో సహాయక చర్యలను వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు. హోం మంత్రి అమిత్ షా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు.