వర్షాకాలంలో ఇల్లే ఎలర్జీలకు నిలయం జాగ్రత్త!
వర్షాకాలంలో తేమవల్ల రకరకాల ఎలర్జీలు ఎదురవుతాయి. ఈ ఎలర్జీకి కారణమయ్యే క్రిమికీటకాలు, బొద్దింకలకు దూరంగా వుండాలంటే ఇంటిని ఎప్పటికప్పుడు పొడిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
ట్యాప్‌లు, పైపులు లీకేజీలుంటే తప్పనిసరిగా మరమ్మత్తులు చేయించుకోవాలి. ఎలర్జీలకు ఎక్కువగా కారణమయ్యే కర్టెన్లు, రగ్గుల్ని తరచూ వాష్ చేసుకోవాలి. వర్షాకాలంలో ఇంట్లో పరచిన కార్పెట్లను చుట్టేయడం బెటర్. తడితో ఇంట్లోకి బయటికి తిరుగుతుంటే వాటిపై మురికి పేరుకుపోతుంది.
వంటగదిలోలోని వృథా పదార్థాల బాస్కెట్‌ను ప్రతిరోజూ ఖాళీచేసి శుభ్రంగా వుంచుకోవాలి. కార్పెట్ల వాడకం తప్పనిసరి అనుకున్నట్లైతే చిన్నచిన్నవి వాడాలి. తరచూ వాక్యూమ్ క్లీనింగ్ చేస్తుండాలి. అయితే పడకగదికి మాత్రం వీటిని వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంట్లో పొగకు తావు ఇవ్వకూడదు. పొగ ఎలర్జీని పెంచుతుంది. వంటగదిలో వెంటిలేషన్ వుండాలి. పదార్థాల తయారీ తాలూకు పొగను మిగత గదుల్లోకి రానివ్వకూడదు. వెంటిలేషన్ లేనప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడాలి. ఇంట్లో దుమ్మూ, బూజుల్ని ఎప్పటికిప్పుడు దులపాలి. దుప్పట్లు, దిండు గలీబులు వేడి నీటిలో వాష్ చేయాలి.
కిటికీ ఊచల్ని తడి వస్త్రంతో శుభ్రపరచాలి. కిచెన్ కప్ బోర్డుల్ని వారానికి ఒకసారి నీట్‌గా దులుపుకోవాలి. ఎయిర్ ఫ్రెషనర్లు, సెంటెడ్ క్యాండిల్స్ సువాసనాభరితంగానే వున్నా ఇవి అలర్జీని బాగా పెంచుతాయి. తలుపులన్నీ మూసేసి వెలిగిస్తే ఇరిటేషన్‌ను పెంచుతాయి. అలంకరణ సామగ్రిని కూడా తగ్గించాలి, వీటి వల్ల దుమ్ము పేరుకునే అవకాశం ఉంది.