టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం.. 22కి చేరిన మృతుల సంఖ్య
టర్కీ, గ్రీస్‌ను భారీ భూకంపం కుదిపేసింది. టర్కీలో భూకంపం వల్ల మరణించినవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం 14 మంది చనిపోగా, ఇప్పుడు ఆ సంఖ్య 22కు చేరింది. భూకంపం కారణంగా 700 మందికిపైగా గాయపడ్డారు. టర్కీ తీరానికి, గ్రీకు దీవి సామోసుకు మధ్యలో ఏజియన్ సముద్రంలో 196 సార్లు భూమి కంపించిందని అధికారులు గుర్తించారు.
అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం సమోస్‌లోని గ్రీకు పట్టణం కార్లోవాసికి 14 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 7.0గా నమోదయ్యింది. దీని ప్రభావంతో సామోస్, ఏజియన్ సముద్రంలో చిన్నపాటి సునామీ వచ్చింది.
టర్కీలోని ఇజ్మిర్‌లో 20కిపైగా బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శిథిలాల్లో చిక్కుకున్న బాధితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.