శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (08:24 IST)

బలూచిస్థాన్ ప్రావీన్స్‌లో భారీ భూకంపం.. 20 మంది మృత్యువాత

పాకిస్థాన్ దేశంలోని బలూచిస్థాన్ ప్రావీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూప్రకంపనల ధాటికి ప్రజలు భయంతో వణికిపోయారు. బలూచిస్థాన్‌ రాష్ట్రంలోని హర్నోయ్‌ అనే ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 3.30 సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. 
 
భూకంపం ధాటికి 20 మంది చనిపోయారని, 200 మందికిపైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బలూచిస్థాన్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ అధికారి నసీర్‌ నాసర్‌ చెప్పారు.
 
కాగా, ప్రజలంతా మంచి గాఢ నిద్రలో ఉన్నసమయంలో ఈ భూకంపం సంభవించింది. భూప్రకంపనల ధాటికి పైకప్పులు కూలిపడటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. భూకంపం సంభవించిన ప్రాంతానికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయని వెల్లడించారు. భూప్రకంపనలతో క్వెట్టాలో ప్రజలు భయాందోళనలకు గురైనట్లు తెలిపారు.
 
కాగా, గత 2015, అక్టోబరు నెలలో పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దుల్లో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో 400 మంది మృతిచెందారు. 2005, అక్టోబర్‌ 8న వచ్చిన భూకంపం వల్ల సుమారు 73 వేల మంది మరణించగా, 30.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.