సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం

తొలిదఫా వాణిజ్య ఒప్పందానికి చైనా-అమెరికా సిద్ధం..!

అమెరికా- చైనా మధ్య ప్రస్తుత చర్చల్లో పురోగతి సంకేతాలు వచ్చాయి. ఇరుదేశాల మధ్య తొలి దఫా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

త్వరలోనే సంతకాలు చేసుకొని... వాణిజ్య యుద్ధానికి ముగింపు పలకాలని భావిస్తున్నట్లు సమాచారం. అమెరికాకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేసేందుకూ చైనా అంగీకరించింది. అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో తొలి దఫా ఒప్పందాలపై సంతకాలు చేసుకోనున్నాయి ఇరుదేశాలు.

ఈ మేరకు ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో సంకేతాలిచ్చాయి. అగ్రరాజ్యానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తులను భారీ స్థాయిలో కొనుగోలు చేసేందుకు డ్రాగన్​ దేశం అంగీకరించింది. మేధో సంపత్తి, చైనా మార్కెట్లో అమెరికా వస్తువులను వృద్ధి చేయాలన్న ట్రంప్​ డిమాండ్​ను చైనా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

'ఆర్థిక, వాణిజ్య ఒప్పందాలు ఇరు దేశాలకు ఎంతో ప్రాముఖ్యం. ఈ ఒప్పందాల వల్ల చైనా, అమెరికాలకే కాకుండా... ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యం సజావుగా సాగుతుందని' తెలిపారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి షుయాంగ్​. అమెరికా ఉత్పత్తులు కొనుగోలు చేస్తాం... చైనా కంపెనీలు స్థానిక అవసరాలను బట్టి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగొలు చేస్తాయని పేర్కొన్నారు షుయాంగ్​.

ఈ ఏడాది చైనా కంపెనీలు 20 మిలియన్​ టన్నుల సోయాబీన్స్​, 700 వేల టన్నుల పంది మాంసం, జొన్నలు, 230 వేల టన్నుల గోధుమలు, 320 వేల టన్నుల పత్తిని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నట్లు వెల్లడించారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను ఇకముందు కూడా అధిక మొత్తంలో కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక చైనా వస్తువులపై సుంకాలు పెంచి ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెర తీశారు డొనాల్డ్​ ట్రంప్. అప్పటి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య పోరు జరుగుతూనే ఉంది. తాజాగా జరుగుతున్న చర్చలతో దీనికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.