సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2020 (09:55 IST)

వూహాన్ నుంచి విముక్తి.. స్వదేశానికి వచ్చిన 324 మంది భారతీయులు

కరోనా వైరస్ కారణంగా వూహాన్ నగరం ఇపుడు శ్మశాన నిశ్బబ్ధాన్ని తలపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ నగరంలోని వీధులు ఇపుడు బోసి, కళావిహీనంగా కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం కారణంగా ఈ నగరంలోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. అయితే, ఈ వైరస్ భారత్‌లోకి ప్రవేశించకుండా ఉండేందుకు వీలుగా కేంద్రం తగిన చర్యలు తీసుకుంది. ఇందులోభాగంగా, చైనాకు విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ కారణంగా వూహాన్ నగరంలో 324 మంది భారతీయులు చిక్కుకునిపోయారు. వీరిని స్వదేశానికి కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా తీసుకొచ్చింది. 
 
ఎయిరిండియా సంస్థ ప్రత్యేక బోయింగ్‌ విమానం 'అజంతా'లో తరలించింది. నలుగురు పైలట్లు సహా సిబ్బంది, ఇంజనీర్లు అంతా కలిపి 33 మందితో శుక్రవారం మధ్యాహ్నం 1.18 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరిన విమానం మళ్లీ రాత్రి 10 గంటల తర్వాత 350 మందికి పైగా భారతీయులతో ఢిల్లీకి చేరుకుంది. 
 
కేంద్ర ఆరోగ్య శాఖ ఈ విమానంలో ఐదుగురు వైద్యులను, మందులు, మాస్కులు, ఓవర్‌ కోట్లు, ప్యాకేజ్డ్‌ ఆహారాన్ని పంపింది. సిబ్బంది, వైద్యులు వూహాన్‌లో దిగేటపుడు పూర్తి రక్షణ సూట్లు ధరిస్తారు. అక్కడ నుంచి వస్తున్నవారు విమాన సిబ్బందితో ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేకుండా ప్రతి సీటు వద్ద భోజనం ఏర్పాట్లు చేశారు. రెండు మరుగుదొడ్లను సిబ్బంది కోసమే కేటాయించారు. ఈ రెస్క్యూ మిషన్‌కు కెప్టెన్‌ అమితాబ్‌ సింగ్‌ నేతృత్వం వహించారు. 
 
కాగా, స్వదేశానికి తీసుకొచ్చిన 350 మందికి విమానంలోనే వైద్య పరీక్షలు చేశారు. వీరిలో కరోనా వైరస్ సోకిన వారిని ప్రత్యేక వార్డులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారికి కోలుకున్న తర్వాత స్వస్థలాలకు పంపిస్తారు. వైర్‌సకు కేంద్రస్థానం నుంచి వస్తున్న నేపథ్యంలో వారిని క్వారంటైన్లలో ఉంచారు. వారి కోసం భారత సైన్యం ఢిల్లీకి సమీపంలోని మనేసర్‌లో ఒక క్వారంటైన్‌ను నిర్మించింది. 
 
అక్కడ వారిని రెండు వారాలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. ప్రత్యేక విమానంలో వచ్చినవారందరికీ తొలుత విమానాశ్రయంలోనే పరీక్షలు చేశారు. ఎవరికైనా వైరస్‌ సోకిందన్న అనుమానం కలిగితే వారిని ఢిల్లీ కంటోన్మెంట్‌ బేస్‌ హాస్పిటల్‌లోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స చేస్తారు. కాగా.. కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అన్ని రకాల శ్వాసకోశ మాస్కుల ఎగుమతిపై నిషేధం విధించింది. వాటిని పెద్దమొత్తంలో ఎగుమతి చేస్తే స్వదేశంలో వాటి కొరత వచ్చే ప్రమాదముందని గ్రహించి ఈ నిర్ణయం తీసుకుంది.