శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2024 (10:42 IST)

ప్రపంచలోనే అతిపెద్ద విమానాశ్రయం నిర్మాణం.. స్పెషాలిటీస్ ఏంటంటే...

dubai airport
దుబాయ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం నిర్మాణంకానుంది. ఈ మేరకు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదివారం ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఈ ఎయిర్ పోర్టును అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలవనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 34.85 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. అంటే భారతీయ కరెన్సీలో రూ.2.9 లక్షల కోట్లు అన్నమాట. పదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని దుబాయ్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
 
ఏడాదికి 260 మిలియన్ల మంది రాకపోకలు కొనసాగించేలా ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రస్తుత దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుందని ఆయన చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో దుబాయ్ ఎయిర్ పోర్టు నుండి అన్ని కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ చేయడం జరుగుతుందన్నారు.
 
400 టెర్మినల్ గేట్లు, ఐదు సమాంతర రన్ వేలు ఈ విమానాశ్రయం సొంతం. ఈ ఎయిర్ పోర్టు ఫ్లాగ్లిప్ క్యారియర్ ఎమిరేట్స్, లోబడ్జెట్ విమానయాన సంస్థ ఫ్లై దుబాయ్‌తో పాటు ప్రపంచాన్ని దుబాయ్‌కు, బయటికి కనెక్ట్ చేసే అన్ని ఎయిర్ లైన్ భాగస్వాములకు కొత్త డెస్టినేషన్ కానుందని దుబాయ్ ప్రభుత్వ ఎయిర్ లైన్ ఎమిరేట్స్ చైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్-మక్తూమ్ వెల్లడించారు. ఈ నిర్మాణం "ప్రపంచ వేదికపై ప్రముఖ ఏవియేషన్ హబ్‍గా దుబాయ్ స్థానాన్ని మరింత పటిష్ఠం చేస్తుంది" అని దుబాయ్ ఎయిర్ పోర్టు సీఈఓ పాల్ గ్రిఫిత్స్ దుబాయ్ మీడియాతో అన్నారు.
 
'అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది రాకపోకలు కొనసాగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఏడాదికి దాదాపు 260 మిలియన్ల మంది ప్రయాణీకులు ఈ ఎయిర్ పోర్టు ద్వారా ప్రయాణాలు కొనసాగించవచ్చు. ఇది ప్రస్తుత దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కంటే ఐదు రెట్లు అధికం. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని కార్యకలాపాలు రాబోయే సంవత్సరాల్లో దీనికి బదిలీ అవుతాయి. విమానాశ్రయం 400 ఎయిర్ క్రాఫ్ట్ గేట్లు, ఐదు సమాంతర రన్ వేలను కలిగి ఉంటుంది. ఏవియేషన్ రంగంలో తొలిసారిగా కొత్త ఏవియేషన్ టెక్నాలజీలు ఉపయోగించబడతాయి' అని అల్ మక్తూమ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.