పాకిస్థాన్‌లో అగ్నిప్రమాదం - 21 మంది సజీవ దహనం
పాకిస్థాన్ దేశంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది సజీవదహనమయ్యారు. వేగంగా వెళుతున్న బస్సులో మంటలు చెలరేగి 21 మంది అగ్నికీలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 12 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సింధ్ ప్రావిన్స్‌లోని జంషోర్ జిల్లా నూరియాబాద్ సమీపంలో బుధవారం అర్థరాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఏసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘోరం జరిగినట్టు సమాచారం తెలుస్తోంది.
సింధ్ ప్రావిన్స్ ప్రాంతానికి చెందిన 45 మంది ఏసీ బస్సులో సొంతూళ్లకు బయలుదేరారు. బస్సు జంషోర్ జిల్లా నూరియాబాద్ ఏం-9 మోటార్ వేపై వెళుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లో బస్సు మంటల్లో కాలి బూడిదైపోయింది. కిటికీలు మూసి ఉండటంతో దట్టమైన పొగ అలుముకుంది. మంటలు కాలి కొందరు చనిపోగా, దట్టమైన ఊపిరాడక మరికొంతమంది ప్రాణాలు విడిచారు.