ఇండోనేషియా ఎన్నికలు... పిట్టల్లా రాలుతున్న ఎన్నికల సిబ్బంది. ఎందుకు?
ఇండోనేషియాలో అధ్యక్ష పదవి కోసం ఏప్రిల్ 17న ఎన్నికలు జరిగాయి. దాదాపు 26 కోట్ల మంది ఉన్న జనాభా ఉన్న ఆ దేశంలో ఎన్నికల కమిషన్ ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించింది. ఇండోనేసియాలో 19 కోట్ల మంది ఓటర్లు ఉండగా 80 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఇక్కడ మన దేశంలో ఉన్నట్లు ఒక మనిషికి ఒక ఓటు కాకుండా ఒక్కో ఓటరు ఐదు బ్యాలెట్ పేపర్లలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది.
ఎన్నికల నిర్వహణ వరకు బాగానే జరిగినా ఆ తర్వాత కౌంటింగ్ సమయంలో సమస్యలు తలెత్తాయి. ఈ ఎన్నికల ఫలితాలను మే 22వ తేదీన వెలువరించాల్సి ఉన్నందున కోట్ల సంఖ్యలో ఉన్న బ్యాలెట్ పేపర్లను ఎన్నికల సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి మరీ కౌంటింగ్ చేయాల్సి వస్తోంది. దీంతో వందలాది మంది సిబ్బందికి అలసట ఎక్కువై తట్టుకోలేక ప్రాణాలను కోల్పోతున్నారు.
శనివారం వరకు 272 మంది ఎన్నికల సిబ్బంది ఒత్తిడిని తట్టుకోలేక చనిపోయారని, మరో 1,878 మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని ఎలక్షన్ కమిషన్ తెలియజేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి అధికారికి మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ఆరోగ్య శాఖ ఓ సర్కులర్ విడుదల చేసింది.
చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే యోచనలో ఆర్థికశాఖ ఉంది. ఇలా ఉండగా ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణలో ఘోర వైపల్యం చెందిందని, తగిన సిబ్బందిని ఏర్పాటు చేసుకోలేకపోవడం కారణంగానే ఇంతమంది చనిపోయారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.