జో బైడెన్ ముందున్నది పూలబాట కాదు.. కత్తి మీద సామే!
అమెరికా అధ్యక్షుడిగా జో-బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బైడెన్ ముందున్నది పూలబాట కాదు. అమెరికా చరిత్రలో గత 90 ఏళ్లలో చూడనంత సంక్షోభ పరిస్థితుల మధ్య బైడెన్ దేశాధ్యక్ష పదవి చేపడుతున్నారు. గత వందేళ్లలో ఎన్నడూ చూడనంత వైద్య ఆరోగ్య అత్యవసర పరిస్థితిని అమెరికా ప్రస్తుతం చూస్తోంది. రోజుకు 4వేల మంది చనిపోవడం, ఇప్పటికే మరణించిన వారి సంఖ్య 4 లక్షలకు చేరుకోవడంతో బైడెన్ దీనిని తన ఫస్ట్ టార్గెట్‌గా చేసుకున్నారు.
కోవిడ్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కకావికలమైపోయింది. లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ వల్ల పరిస్థితి మరింతగా దిగజారింది. వీటికి తోడు దేశవ్యాప్తంగా వేలమంది ఉద్యోగాలు కోల్పోయారు. దీన్ని పునరుద్ధరించడం బైడెన్‌కు కత్తి మీద సామే. 1861 అంతర్యుద్ధం తరువాత అమెరికన్ సమాజం నిట్టనిలువుగా చీలిపోయిన సన్నివేశం ఇపుడే పొడగట్టింది. దీనికి ట్రంప్ ఆజ్యం పోశారు.
విస్తరణవాదంతో నానాటికీ రెచ్చిపోతున్న చైనాకు ఆయన ఎంతవరకూ కళ్లెం వేస్తారన్నది చూడాలి. ఇక ఇస్లామిక్ దేశాలతో ట్రంప్ ద్వేషమయ సంబంధాలను కొనసాగించారు. దానిని బైడెన్ రివర్స్ చేయనున్నారు.
ఈ చీలికను మళ్లీ పూడ్చి దేశాన్ని ఏకం చేయడం బైడెన్ ముందున్న అతి పెద్ద సవాలు. అందుకే ఆయన అమెరికా యునైటెడ్ అన్న నినాదాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. ట్రంప్ అనుసరించిన విదేశాంగ విధానం వల్ల ఓ రకంగా ప్రపంచ నేతగా ఏళ్ల తరబడి ఉన్న గుర్తింపును అమెరికా కోల్పోయింది. దీన్ని సరిదిద్దుతానని బైడెన్ ఇప్పటికే ప్రకటించారు. అమెరికా ఈజ్ బ్యాక్ అన్నది ఆయన నినాదం.